Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష.. ఇటు జూబ్లీహిల్స్.. అటు స్థానికం!

తెలంగాణలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Political Desk   |   9 Oct 2025 11:00 PM IST
రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష.. ఇటు జూబ్లీహిల్స్.. అటు స్థానికం!
X

తెలంగాణలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సిరావడం రేవంత్ రెడ్డికి నిజమైన సవాల్ గా చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ పార్టీని విజయతీరాలకు చేర్చడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత. ఈ విజయాలే ఆయన భవిష్యత్తును నిర్దేశించనుండటంతో గెలిచి తన నాయకత్వానికి తిరుగులేదని నిరూపించుకోవాల్సివుంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ రెండు ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండంగానూ చూస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి సుమారు రెండేళ్లుగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను అమలు చేయలేక దిక్కులు చూస్తున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను ఆయన మంత్రివర్గ సహచరులు లెక్క చేయడం లేదని, పేరుకే ఆయన ముఖ్యమంత్రి అని కీలక శాఖలపై పర్యవేక్షణ అధికారం లేకుండా కాంగ్రెస్ అధిష్టానం కత్తెర వేసిందని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో తానే సుప్రీం పవర్ అని నిరూపించుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి అత్యావసరంగా చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికతోపాటు స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి ప్రజల్లో తనపై పరపతి చెక్కుచెదరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సివుంటుంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా స్థానిక ఎన్నికలను ఇన్నాళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజులకే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, రేవంత్ రెడ్డి కొన్నాళ్లు సమయం తీసుకోడానికి వాయిదా వేశారు. అలా ఏడాదిన్నర అయిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని పార్టీ మరింత బలపడిందని చాటుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో ఊహించని విపత్తులా వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతోందని అంటున్నారు. దీంతో ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో జరిగే పంచాయతీ పోరు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్షగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాదు నగరంలో కాంగ్రెస్ ఒక్కస్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది. ఇక గ్రేటర్ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే నగరంపైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయొచ్చని సీఎం భావిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ను ఎట్టిపరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని సీఎం పావులు కదుపుతున్నారు. మొత్తానికి ఒకేసారి ఎదురైన ఎన్నికల్లో గెలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ గా మారిందని అంటున్నారు.