సీఎం రేవంత్ కు రిస్కుగా మారనున్న జూబ్లీహిల్స్
కొన్నిసార్లు తెగించాల్సి ఉంటుంది. అందుకు రిస్కును భరించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
By: Garuda Media | 30 Oct 2025 8:15 PM ISTకొన్నిసార్లు తెగించాల్సి ఉంటుంది. అందుకు రిస్కును భరించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఒక ఉప ఎన్నికను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవటం.. దాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించటం అప్పుడప్పుడు జరిగేదే. అయితే.. ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా.. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి అయితే ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరనే చెప్పాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రిగా నిలుస్తారని చెప్పక తప్పదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావటానికి ముందు నుంచే.. సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. వ్యూహాత్మకంగా పలువురు మంత్రులు నియోజకవర్గంలో పర్యటించేలా చేయటం.. పలు డెవలప్ మెంట్ పనులు చేపట్టటం.. పెద్ద ఎత్తున నిధులు కేటాయించటం లాంటివి చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో కంటోన్మెంట్ మినహా మరే అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు.
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం కూడా అనూహ్య రీతిలో తెర మీదకు వచ్చిన ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ విజయం సాధించటం తెలిసిందే. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ అనారోగ్య పరిస్థితుల్లో మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటం ద్వారా తన ముద్రను వేయాలని సీఎం రేవంత్ ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు.
ఇందుకు తగ్గట్లే.. జూబ్లీహిల్స్ ఎన్నికను తాను ఎంత సీరియస్ గా తీసుకున్న విషయానని చేతల్లో చూపిస్తున్నారని చెప్పాలి. సినీ కార్మికులు అత్యధికంగా ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం బహిరంగ సభ పెట్టటమే కాదు.. అనూహ్య రీతిలో ఇచ్చిన హామీల గురించి తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్న విషయాన్ని ప్రకటించటమే కాదు.. ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్న విషయాన్ని వెల్లడించి.. అందుకు తగ్గ షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు.
ఇదంతా చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. ఏది ఏమైనా.. ఎంతటి కఠిన పరిస్థితులైనా.. ఎలాంటి ప్రతికూలతలు ఉన్నా వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధమైన విషయాన్ని సీఎం రేవంత్ తన చేతలతో స్పష్టం చేస్తున్నారని చెప్పాలి. ఇంత చేస్తున్న ఆయనకు ఉన్న రిస్కు తక్కువేం కాదు. గెలుపు ధీమా ఎంత ఉన్నప్పటికి అంతిమంగా తీర్పు ఇచ్చేది మాత్రం ఓటర్లే. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గెలుపు దక్కదు. ఫలితం అనుకూలంగా రాదు.
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. సీఎం రేవంత్ కు ఎదురయ్యే ఇబ్బందులు.. సవాళ్లు అన్ని ఇన్ని కావు. చేతిలో అధికారం పెట్టుకొని కూడా ఉప ఎన్నికలో సానుకూల ఫలితాల్ని తీసుకురాలేకపోయారన్న అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు కాదు.. సొంత పార్టీకి చెందిన ముఖ్యనేతలే విరుచుకుపడే వీలుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. దగ్గర దగ్గర రెండేళ్ల రేవంత్ పాలనకు జూబ్లీ ఫలితం ఒక రెఫరెండమ్ అని ప్రతిపక్షాలు విరుచుకుపడే వీలుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. జూబ్లీ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ ఇంత సీరియస్ గా తీసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతుంది. అంతా బాగుంటే అంతా ఓకే. ఏ మాత్రం తేడా వచ్చినా ఎదురయ్యే కష్టం గురించి.. రిస్కు గురించి ఆలోచించటం లేదా? అన్నది ప్రశ్న. అయితే.. ఈ ఉప ఎన్నికలో సీఎం అనుకున్నట్లుగా సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకోవటం బీఆర్ఎస కు కోలుకోలేని దెబ్బ తగలటమే కాదు.. ఆ పార్టీ ఆత్మరక్షణలో పడటం ఖాయమన్న విషయం రేవంత్ కు తెలుసు. అందుకే.. తనకు రిస్కు అయినప్పటికీ జూబ్లీ ఎన్నికను తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా వ్యవహరించటమే కాదు.. ఆ గెలుపును తన సమర్థతకు నిదర్శనంగా.. తన పాలనకు ఓటర్లు ఇచ్చిన తీర్పుగా ప్రకటించుకోవాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
