Begin typing your search above and press return to search.

'అసెంబ్లీకి కేసీఆర్ రావాలి.. సలహా ఇవ్వాలి' సీఎం రేవంత్ ప్లానింగ్ పెద్దదే

గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు వివరించాం. గవర్నర్ తో చర్చించిన తర్వాతే ప్రసంగాన్ని తయారు చేశాం.

By:  Garuda Media   |   19 March 2026 9:38 AM IST
అసెంబ్లీకి కేసీఆర్ రావాలి.. సలహా ఇవ్వాలి సీఎం రేవంత్ ప్లానింగ్ పెద్దదే
X

రాజకీయ నేతల నోటి నుంచి మాటలు ఉత్తనే రావు. అందునా.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.. విపక్ష నేత కేసీఆర్ లాంటి ముఖ్యనేతల మధ్య ఒకేలాంటి మాటలు పదే పదే అస్సలు రావు. అలా వచ్చాయంటే దాని వెనుక లెక్క వేరే ఉండటం పక్కా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తాను పాల్గొనే రాజకీయ వేదికల నుంచి సీఎం రేవంత్ నోటి నుంచి ఒక విన్నపం తరచూ వస్తూనే ఉంటుంది. అది.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని. ఈ మాట రేవంత్ నోటి నుంచి అదే పనిగా వస్తుంటుంది? అన్న ప్రశ్నను లోతుగా వేస్తే.. చాలా ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

రేవంత్ లాంటి ముఖ్యమంత్రి.. తన రాజకీయ ప్రత్యర్థి.. తన పొడను ఏ మాత్రం ఇష్టపడని కేసీఆర్ ను అంత అప్యాయంగా సభకు రావాలని.. ప్రభుత్వానికి సలహాలు.. సూచనలు ఇవ్వాలని అడగటం వెనుక అసలు వ్యూహం వేరే ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం.. సీఎం రేవంత్ ఎన్నిసార్లు కోరితే వాటికి రెట్టింపు సార్లు గులాబీ సారు సభకు వచ్చే ఛాన్సు ఉండదని చెబుతుంటారు. రేవంత్ చెబితే సభకు రావాలా? అతడు పిలిస్తే.. సభకు పోవాలా? లాంటి వాదన బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ మైండ్ సెట్ ను బాగా అర్థం చేసుకున్న కొద్దిమంది నేతల్లో రేవంత్ రెడ్డి ఒకరుగా చెబుతారు. అందుకే.. కేసీఆర్ సభకు వస్తే ఎలా టార్గెట్ చేయాలి? తీవ్ర వ్యాఖ్యలతో గులాబీ బాస్ ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్లాన్ ఏ.. ప్లాన్ బి ఉంటుందన్న మాట ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.

అలా అని.. కేసీఆర్ సభకు వస్తే.. ఏదో జరిగిపోతుందా? అంటే.. అలాంటిదేమీ ఉండదన్న విషయం రేవంత్ కు తెలియంది కాదు. ఆ మాటకు వస్తే గులాబీ బాస్ కు కూడా ఈ విషయం మీద స్పష్టత ఉందన్నది తెలిసిందే . తన మాటలతో సీఎం రేవంత్ తనకు ఎర విసురుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోలేనంత వారు కాదు కేసీఆర్. అందుకే.. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ.. చిక్కడు, దొరకడన్న రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అలా అని ఈ తరహా వ్యూహం దీర్ఘకాలం వర్కువుట్ అవుతుందా? లేదా? అన్న విషయంలోకి వెళితే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైనం కేసీఆర్ కు మరింత డ్యామేజ్ చేస్తుందని చెప్పాలి.

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన తెచ్చి.. చేసిన వ్యాఖ్యల్ని ఒకటికి మూడుసార్లు అండర్ లైన్ పెట్టి చూసినప్పుడు కొత్త అర్థాలు మనసులోకి మెదలకు మానదు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని శాంపిల్ గా చూస్తే..

- గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు వివరించాం. గవర్నర్ తో చర్చించిన తర్వాతే ప్రసంగాన్ని తయారు చేశాం.

- రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా.. రాచరికపు పోకడలు పోలేదు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి. లేనప్పుడు అదే ధోరణి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు.

- కొత్త గవర్నర్ ను కలిసేందుకు ప్రతిపక్ష నేత వస్తారనుకున్నాం. ప్రదాన ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతామని భావించాం. గవర్నర్ ప్రసంగంపై సూచనలు.. సలహాలు వస్తాయనుకున్నాం. ప్రధాన ప్రతిపక్షం నుంచి కనీస స్పందన రాలేదు. కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన సభలో పాల్గొని సూచనలు.. సలహాలు వస్తాయనుకున్నాం.

- ప్రధాన ప్రతిపక్షం నుంచి కనీస స్పందన లేదు. కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన సభలో పాల్గొని సూచనలు.. సలహాలు ఇవ్వాలి.

ఇదంతా చూస్తే.. కేసీఆర్ అసెంబ్లీ రావాలన్న దాని కంటే.. రాకపోవటాన్ని ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన తీరును మార్చుకోలేదని.. అహంకారంతోనే వ్యవహరిస్తారన్న విషయాన్ని సీఎం రేవంత్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అంతేకాదు.. అంత అనుభవం ఉన్న పెద్ద మనిషి.. కనీసం పాలనాపరమైన సలహాల్ని ఇవ్వకుండా ఉన్న తీరును పదే పదే ప్రస్తావించటం ద్వారా.. ఎంతటి అహంకారం? అన్న భావనను కలిగించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.

అందుకే.. తన తాజా ప్రసంగం ద్వారా సీఎం రేవంత్ తన మాటల్లోని శ్లేషతో ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమయ్యేలా చేయటమే లక్ష్యమని చెప్పాలి. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ నూటికి నూరుపాళ్లు విజయం సాధిస్తున్నారని చెప్పాలి. ఓడిన తర్వాత కూడా రాజరికపు పోకడలు అవసరమా? అన్న ప్రశ్న కొరడా ఝుళిపించినట్లుగా చెప్పక తప్పదు. ఇదంతా చూస్తే.. పైకి పెద్దమనిషి ఐడియాలజీ రాష్ట్రానికి మేలు చేస్తుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ తాజా వ్యాఖ్యలకు గులాబీ బాస్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.