సీఎం రేవంత్ 'ఎత్తు' మాట హరీశ్ ను బాగా తగులుతుందా?
కేసీఆర్..కేటీఆర్.. హరీశ్ రావుల నోటి దురుసుతనం.. దూకుడు.. ముల్లు మాదిరి గుచ్చేలా మాట్లాడే విషయంలో రేవంత్ తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Garuda Media | 18 Jun 2026 12:02 PM ISTబీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్.. ఆయన కుమారుడు కం బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్.. మాజీ మంత్రి కం గులాబీ పార్టీకి టాస్క్ మాస్టర్ గా వ్యవహరించే హరీశ్ రావులకు ఒక విషయంలో ఒకేలా వ్యవహరిస్తారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించటమే కాదు..అవసరానికి తగ్గట్లు ఎలాంటి మాటను అనటానికైనా వెనుకాడరు. అది జైపాల్ రెడ్డి విషయంలో కానీ జానారెడ్డి విషయంలో కానీ. అవసరమైనప్పుడు గౌరవ మర్యాదల్ని ఒలకపోస్తూనే.. రాజకీయ అవసరాల విషయానికి వచ్చినప్పుడు పొగిడిన నోటితోనే వెనుకా ముందు చూడకుండా తిట్టేయటం వారికో అలవాటుగా కనిపిస్తుంది.
తెలంగాణ నేతల విషయంలోనే కాదు చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. ఇలా పేరు ఏదైనా.. తమ రాజకీయ ప్రయోజనాలను దెబ్బేసే అవకాశం ఉందనిపిస్తే చాలు.. వారి మాటల్లో తెలంగాణ భావోద్వేగం పొంగిపోర్లుతుంది. దాని మాటున తాము అనాల్సిన మాటల్ని అనేసేందుకు అస్సలు వెనుకాడరు. అలాంటి వారిని మాటలో ఇబ్బంది పెట్టటం.. ఇరుకున పెట్టటం లాంటివి ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. అందుకు మినహాయింపుగా మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చెప్పాలి.
కేసీఆర్..కేటీఆర్.. హరీశ్ రావుల నోటి దురుసుతనం.. దూకుడు.. ముల్లు మాదిరి గుచ్చేలా మాట్లాడే విషయంలో రేవంత్ తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రేవంత్ ఇటీవల కాలంలో హరీశ్ రావును ఉద్దేశించి.. ఆయన ఎత్తును ప్రస్తావిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి. హరీశ్ ను ఇంత తీవ్రంగా విరుచుకుపడే వారిలో రేవంత్ మొదటి వరుసలో ఉంటే.. కవిత ఆ తర్వాతి స్థానంలో ఉంటారు.
ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్ ను ప్రస్తావిస్తూ.. తాటి చెట్టు లెక్క పెరిగినవు అంటూ ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు హరీశ్ ను బాగానే తగిలినట్లుగా కనిపిస్తోంది. స్కూల్ పిల్లలకు నా ఎత్తుతో ఏం పని రేవంత్ రెడ్డి? పిల్లలకు మంచి విషయాలు చెప్పాల్సింది పోయి ఈ చిల్లర మాటలేంది? అంటూ ఫీలైనట్లుగా మాట్లాడిన హరీశ్ మాటలు ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడిన మాటల్లో పిల్లలకు మంచి మాటలుచెప్పాలే కానీ ఇలా మాట్లాడతారా? అంటూ మాట్లాడటమే తప్పించి.. తనదైన రోటీన్ తీరుతో విరుచుకుపడింది లేదు. ఇదంతా చూస్తే.. హరీశ్ ను ఎలా ఇరుకున పెట్టాలి? ఏ మాటలతో ఆయన హర్ట్ అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని సీఎం రేవంత్ పట్టేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారుతోంది.
