నవీన్ యాదవ్ కు పదవి ఫిక్స్.. మంత్రి కాదు.. కానీ అదే హోదా?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పదవికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
By: Tupaki Political Desk | 20 Nov 2025 7:00 PM ISTజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పదవికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ సంచలన విజయం సాధించారు. ఆయన గెలుపుతో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిందని భావిస్తున్నారు. ఈ ఊపు కొనసాగాలంటే నవీన్ యాదవ్ ను మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఆయనను మంత్రిగా తీసుకోవాలని అనుకున్నా.. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కొన్నాళ్లు వేచిచూడాలని సీఎం నిర్ణయించారని అంటున్నారు.
అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి ఇంకా నెల రోజులు కూడా అవ్వకపోవడం నవీన్ యాదవ్ కి అడ్డంకిగా మారిందని అంటున్నారు. అయితే ఏ విధంగానైనా నవీన్ యాదవ్ ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ విప్ పదవిలో నవీన్ యాదవ్ కి కేబినెట్ హోదా కట్టబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై పార్టీలో ఇప్పటికే ఆయన చర్చిస్తున్నారని అంటున్నారు. కొద్దిరోజుల్లో ఈ నియామకంపై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు.
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వలస వచ్చారు. ఈయన పార్టీ ఫిరాయించడంతో అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా దానం సభ్యత్వం రద్దు చేయమని కోరుతూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. దీంతో దానంకి ఏ పదవి ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు. ఇక కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీసీ కావడం, యువకుడు అవ్వడం వల్ల ఆయన ద్వారా నగరంలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు.
కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటికీ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వీరి అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నవీన్ యాదవ్ ను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం భావించారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రయత్నం కుదరకపోవడం వల్ల ప్రభుత్వ విప్ హోదాలో కేబినెట్ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ నిర్ణయం వల్ల త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. నవీన్ యాదవ్ సేవలు సమర్థంగా వాడుకుంటే నగరంపై కాంగ్రెస్ జెండా ఎగరేయొచ్చని సీఎం లెక్కలు వేస్తున్నారు. మరోవైపు మజ్లిస్ పార్టీతో ఆయనకు ఉన్న సంబంధాలు కూడా పార్టీకి ఉపయోగపడతాయని సీఎం భావిస్తున్నారని అంటున్నారు.
