దేవుళ్ళ మీద రేవంత్ హాట్ కామెంట్స్...వైరల్ కా బాప్
హిందూ దేవుళ్ళ గురించి ఎవరైనా ఏమైనా అంటే అసలు సహించేది లేదన్న భావజాలం ఇపుడిపుడే బలపడుతోంది. అదే సమయంలో హిందూ దేవుళ్ళ మీద కామెంట్స్ చేస్తున్న వారూ అంతకంతకు పెరుగుతున్నారు.
By: Satya P | 3 Dec 2025 9:31 AM ISTహిందూ దేవుళ్ళ గురించి ఎవరైనా ఏమైనా అంటే అసలు సహించేది లేదన్న భావజాలం ఇపుడిపుడే బలపడుతోంది. అదే సమయంలో హిందూ దేవుళ్ళ మీద కామెంట్స్ చేస్తున్న వారూ అంతకంతకు పెరుగుతున్నారు. దానికి పాపులారిటీ కోసం అన్నది ఒక కారణం. అయితే సీఎం స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేకంగా పాపులారిటీ ఏమి అవసరం అని కూడా ఉంటుంది కదా. కానీ వారిది వేరే వ్యూహమో ఆలోచనలో తెలియదు కదా. అందుకే తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద తన దైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ఆయన అన్న మాటలు అయితే నెటిజన్ల భిన్న అభిప్రాయాలకు నోచుకున్నాయి. తెగ వైరల్ కూడా అవుతున్నాయి.
ఇంతకీ అన్నదేంటంటే :
మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు కదా అని కాంగ్రెస్ సమావేశంలో మొదలెట్టిన రేవంత్ పెళ్ళి చేసుకోని హనుమంతుడు దేవుడుగా ఉన్నారు. రెండు పెళ్ళిళ్ళ దేవుళ్ళు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్లమ్మ పోచమ్మ గ్రామ దేవతలు ఉన్నారు కదా అని నవ్వుతూనే చెప్పుకుంటూ పోయారు. కోడి కొయ్యాలనుకునేవారికి దేవుడు ఉన్నారు, పప్పన్నం తినేవారికి కూడా దేవుడు ఉన్నాడు కదా అని ఆయన ప్రశ్నిస్తూ తన ప్రసంగంలో దేవుళ్ళ చర్చని మరింతగా పెంచారు. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు.
కాంగ్రెస్ తో పోలిక పెడుతూ :
అందరికీ వారి వారి అభిమతాలకు తగినట్లుగా దేవుళ్ళు ఉన్నట్లే కాంగ్రెస్ పార్టీ కూడా అందరి కోసం పనిచేసే పార్టీ అని ఒక కొత్త పోలిక తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వారిని మనుషులను కలుపుకుని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానిస్తూనే దేవుళ్ల ప్రస్తావన తెచ్చారు. అక్కడితో ఏ మాత్రం ఆగలేదు, దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు అని కూడా అన్నారు. ఒకాయన వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు, మరోకాయన ఆంజనేయస్వామికి మొక్కుతాను అంటాడు, మరొకాయన అయ్యప్ప మాల వేస్తే ఇంకో ఆయన శివమాల వేస్తాడు అని చతుర్లు కూడా వేశారు. దేవుళ్ళ మీదనే ఏకాభిప్రాయం తీసుకుని రాలేనపుడు రాజకీయ నేతల మధ్య ఏకాభిప్రాయం ఎలా ఉంటుంది అనుకుంటారు అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి కాంగ్రెస్ తో పోలిక పెట్టాలనో లేక క్యాడర్ ని ఉబ్బించాలనో లేక ఏకాభిప్రాయం ఎక్కడా లేదని చెప్పడానికో రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి గట్టిగానే చెప్పారు.
బండి ఫైర్ :
అయితే దీని మీదనే బీజేపీ కస్సుమంటోంది. కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద ఫైర్ అయ్యారు. దేవుళ్ళ మీద ఈ విధంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ వంటి పార్టీల మీద హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేయాలని అన్నారు. ఇంకా వీటిని సహించాలా అని ప్రశ్నించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే సరదాకు అన్నారో ఏమో తెలియదు కానీ బీజేపీకి మంచి మసాలానే ఇచ్చారు అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత దూరం పోతుందో.
