Begin typing your search above and press return to search.

ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. సీఎం రేవంత్ భావోద్వేగం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పని భారం, ప్రభుత్వ బాధ్యతలపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   12 Jan 2026 7:32 PM IST
ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. సీఎం రేవంత్ భావోద్వేగం
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పని భారం, ప్రభుత్వ బాధ్యతలపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, సెలవు తీసుకుందామని అనుకున్న ప్రతీసారి ఏదో ఒక పని వచ్చి పడుతోందని తెలిపారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని కేవలం ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే నడపలేరని.. 10.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే అసలైన సారథులని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులని.. వారి సమస్యల పరిష్కారానికే తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నానన్నారు.

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

ఉద్యోగుల్లో తనను ఇష్టపడని వారు కూడా ఉండవచ్చని.. అయినా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతాలు, భత్యాలు ఎలా వస్తున్నాయో అందరూ గమనించాలని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రూ.12 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పన్నులు పెంచాల్సిన అవసరం లేదని.. పన్ను వసూళ్లలో అవకతవకలను అరికట్టి సక్రమంగా వసూళ్లు చేస్తే అవసరమైన నిధులు వస్తాయని సీఎం స్పష్టం చేశారు.

జిల్లాల పునర్విభజనకు కమిటీ

జిల్లాల సరిహద్దులు మార్చాలని పలు విజ్ఞప్తులు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జిల్లాల పునర్విభజన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని చెప్పారు.

రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని భావించి మార్చినట్లు పేర్కొన్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులే పాలనకు పునాది అని, వారి సంక్షేమంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.