Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్ తో చిన్న రాష్ట్రాలకు పెద్ద దెబ్బ.. లెక్కలతో రేవంత్

కేంద్రం చెప్పినట్లుగా డీలిమిటేషన్ జరిగితే.. చిన్న రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.

By:  Garuda Media   |   11 April 2026 8:00 PM IST
డీలిమిటేషన్ తో చిన్న రాష్ట్రాలకు పెద్ద దెబ్బ.. లెక్కలతో రేవంత్
X

త్వరలో కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే జరుగుతున్న చర్చలకు కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వాదననను వినిపిస్తున్నారు. కేంద్రం చెప్పినట్లుగా డీలిమిటేషన్ జరిగితే.. చిన్న రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా.. గణాంకాల్ని చెబుతూ.. తన వాదనతో అర్థవంతమైన అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ కు సంబంధించి జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాది రాష్ట్రాలవాటా ఆధారంగా సీట్ల పెంపును ఎందుకు చేపట్టకూడదని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదిగా పేర్కొన్న ఆయన.. ‘ఈ మెరిట్ ఆధారంగా చేసుకొని సీట్ల పెంపును చేపట్టాలి. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. దక్షిణాదికి ఉండే మెరిట్ అంశాల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాలి. జనాభాలో 2.5 శాతం ఉన్నప్పటికి.. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణది 5 వాతం వాటా. యూపీ కేంద్రానికి చెల్లించే రూపాయికి రూ.3.50.. మధ్యప్రదేశ్ రూ.2.50, బిహార్ రూ.4.50 చొప్పున పొందుతుంటే.. దక్షిణాది రాష్ట్రాలు మాత్రం అందుకు భిన్నంగా యాభై పైసల కంటే తక్కువ ఇస్తున్నారు.

సౌత్ వెస్ట్ రాష్ట్రాలు ఆర్థికంగా ఆధిపత్యం వహిస్తుంటే.. రాజకీయంగా మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు అధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నట్లు డీలిమిటేషన్ తర్వాత చోటు చేసుకునే పరిణామాలకు సంబంధించి మరింత వివరంగా వివరించారు. ‘‘కేరళ.. ఉత్తరప్రదేశ్ మధ్య లోక్ సభ సీట్ల అంతరం ఇప్పుడు 60. ఎన్డీయే చెబుతున్నట్లుగా 50 శాతం సీట్ల పెంపు జరిగితే సీట్ల తేడా 90కు పెరుగుతోంది. అదే శాతాల్లో చూస్తే 100 నుంచి 150శాతానికి పెరుగుతుంది. అప్పుడు దక్షినాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. బిహార్.. మధ్యప్రదేశ్..రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీట్లు సరిపోతాయి. డీలిమిటేషన్ తో దక్షిణాదిలో సీట్లు 130-195 పెరిగితే.. ఉత్తరాదిలో ఏకంగా 600 సీట్ల వరకు ఉంటాయి’ అంటూ తన వాదనకు బలం చేకూరేలా గణాంకాల్ని ప్రస్తావించారు.

మరి దీనిపై మరిన్ని అభ్యంతరాలు తెర మీదకు వస్తాయా? కేంద్రం వీటిని పరిగణలోకి తీసుకొని మరింత కచ్ఛితంగా డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి.. కేంద్రం ఇలాంటి వాదనల్ని తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. కొన్ని ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ ను వ్యతిరేకించని తీరును ప్రస్తావించారు. ఏపీలోనూ డీలిమిటేషన్ ప్రభావం ఉందని.. కానీ అక్కడి ప్రభుత్వం స్పందించటం లేదన్నారు.