రేవంత్ ఢిల్లీ టూర్..కేబినెట్ కుర్చీలు కదులుతాయా ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన వెనక చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు తెలంగాణా ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని ఖాళీలు ఉన్నాయి.
By: Satya P | 16 Dec 2025 7:00 AM ISTముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన వెనక చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు తెలంగాణా ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే మంత్రి వర్గంలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. అదే సమయలో ఆశావహులు కూడా ఉన్నారు. దాంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇక చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. ఒక విధంగా రేవంత్ రెడ్డి సత్తా మీద నమ్మకం ఏర్పడిన నేపథ్యం ఉంది. దాంతో ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ ని ఒప్పించి మెప్పించి మంత్రివర్గ విస్తరణ చేపడతారు అని అంటున్నారు.
పీసీసీ చీఫ్ కామెంట్స్ :
ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కేబినెట్ లో మార్పులు చేర్పుల గురించి చెప్పుకొచ్చారు. ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా మాట్లాడారు, ఇక చాలా మంది దీని మీద ఒకింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఊహాగానాలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి.
రెండేళ్ళలో రెండు సార్లు :
ఇదిలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రెండేళ్ళు పూర్తి అయింది. ఇంకా మూడేళ్ళ పాలన ఉంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధిలో రెండు సార్లు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఇక తాజాగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు అజారుద్దీని ని మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇపుడు మరో రెండు ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా పనితీరు ఆధారంగా కనీసంగా ముగ్గురు నలుగురు మంత్రులను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అన్నది తాజాగా టాక్. దాంతోనే వీటి మీద సీరియస్ గా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని అంటున్నారు.
ఆ దిశగానే అడుగులు :
ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో మంత్రి వర్గం విస్తరణ మీద ఇప్పటికే చర్చించారు అని ప్రచారం సాగుతోంది మరో మూడేళ్ళ సమయం ఉంది కానీ ఇప్పుడే కనుక విస్తరణ చేపడితే రానున్న రెండేళ్ళూ గట్టిగా పనితీరుని చూపించుకోవచ్చునని చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవస్తరం కాబట్టి మిగిలినవి ఈ రెండేళ్ళే కాబట్టి ఇపుడే విస్తరణ జరపడం భావ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఆశావహులను కూడా ఎక్కువ సమయం అలా ఉంచడం లేదా జాప్యం చేయడం మంచిది కాదని అంటున్నారు. ప్రభుత్వం మీద మరింత పాజిటివిటీని పెంచుకునేందుకు అవసరమైన వారిని కేబినెట్ లో చోటిచ్చి పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
ముహూర్తం కుదిరిందా :
ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. రెండు విడతలు పూర్తి అయ్యాయి. మూడో విడత ఈ నెల 17తో ముగియనుంది. దాంతో ఆ తరువాత మంచి ముహూర్తం చూసి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారు అని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని చెబుతున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాలు ప్రాంతాలు ఆధారంగా కూడా కూర్పు మార్పు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఎన్నికల కేబినెట్ గా :
ఇదిలా ఉంటే ప్రస్తుతం జరిపే విస్తరణలో ఎన్నికల కేబినెట్ ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఇప్పటికే రెండేళ్ళ పాటు కొందరు మంత్రులుగా పనిచేసి ఉన్నందువల్ల మిగిలిన కాలానికి కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అన్న మాట కూడా ఉంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు అవకాశం ఇస్తుంది అన్నది చర్చగా ఉంది. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ పెద్ద ఎక్సర్ సైజ్ గా ఉంటాయి. దాంతో రాని వారు ఎపుడూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
