రేవంత్ కి ఏమైంది....లాజిక్ మిస్ ?
నీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఎందుకో రేవంత్ రెడ్డి విషయం మీద ఒక చర్చకు తావిస్తోంది. ఎందుకు ఏమిటి అన్న మాటలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి.
By: Satya P | 6 Nov 2025 5:43 PM ISTతెలంగాణా ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డికి ఏమైంది అని ఒక చర్చ సాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు కానీ ప్రత్యర్థుల మీద ఆయన చేస్తున్న విమర్శలు కానీ ఆవేశాన్ని ఎందుకో బయటపెడుతున్నాయి. విమర్శలు చేసినా లేక తన వాదనను బలంగా వినిపించాలన్నా తర్కం అన్నది ఒకటి ఉంటుంది. రేవంత్ రెడ్డి అయితే తర్కానికి దూరంగా ఎపుడూ స్టేట్మెంట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు, అలాగే ఆవేశంతో ఆయన ప్రసంగాలు చేస్తారు కానీ పరిమితులు కూడా ఉంటాయి. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఎందుకో రేవంత్ రెడ్డి విషయం మీద ఒక చర్చకు తావిస్తోంది. ఎందుకు ఏమిటి అన్న మాటలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి.
కాంగ్రెస్ అంటేనే ముస్లిం :
ఇదేమి స్టేట్మెంట్ అన్నది అంతా అంటున్న మాట. ఆయన ఒక సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ముస్లిం అన్నారు, అంతటితో ఆగకుండా ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని కూడా అన్నారు. రైమింగ్ బాగున్నా టైమింగ్ లాజిక్ ఈ స్టేట్మెంట్ కి ఎంత మేరకు ఉంది అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్నది. నిజానికి ఇది అర్థం లేని ప్రకటన అలాగే అర్థం లేని వాదనగానే అంతా చూస్తున్నారు. ఈ రకంగా ప్రకటనలు ఇవ్వడం వల్లనే బీజేపీకి భారీగా పొలిటికల్ స్కోప్ ఇచ్చేందుకు అవకాశం ఉంటోంది అని కూడా అంటున్నారు.
సెక్యూలర్ కి అర్ధం :
ఇదే సభలో రేవంత్ మరో మాట అన్నారు. తాను మొదటి నుంచి సెక్యులర్ అని. మరి సెక్యులర్ అంటే అన్ని మతాలను ఒక్కలా సమానంగా చూడడం కదా అని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఒక మతం గురించి అంత బాహాటంగా చెబుతూ మాట్లాడితే సెక్యులర్ కి అర్థం ఏమి ఉంటుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఇలాంటివి అంతా అంటూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ అవి హద్దులు దాటితేనే రాజకీయంగానే కాదు శతాధిక చరిత్ర కలిగిన పార్టీకి కూడా ఇబ్బందులు వస్తాయని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ అంటే కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా అందరినీ అక్కున చేర్చుకునే రాజకీయ పార్టీ అని సీఎం హోదాలో చెబితే ఎంత బాగుండది అని అంటున్నారు.
బీజేపీకే ప్లస్ :
ఎలా అంటే ఇప్పటికే దేశంలో చూసుకుంటే బీజేపీ మెజారిటీ వర్గం అంటూ హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేస్తూ వస్తోంది. అది దేశంలో అనేక ఎన్నికల్లో బయటపడుతోంది. గతానికి భిన్నమైన వాతావరణం ఇది. ఇపుడు తెలంగాణాలో ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో వారి ఆలోచనలు వారి వ్యూహాలు ఎపుడూ పదునుగా ఉంటాయి. అటువంటి నేపధ్యంలో వారికి అవకాశాలు ఇచ్చేలా ఈ విధంగా ప్రకటనలు ఇస్తే సహజంగానే మరో వర్గాన్ని బీజేపీ బాగా దగ్గరకు తీస్తుంది. వారి మదిలో కూడా కొత్త ఆలోచనలు పుట్టేలా ఈ ప్రకటనలు ఉంటాయి అని అంటున్నారు.
బూమరాంగ్ అవుతాయి :
ఎన్నికల్లో ఎన్నో చెబుతూ ఉంటారు, ఓట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నాయకులు కానీ పార్టీలు కానీ ప్రకటనలు ఇవ్వడం కానీ విమర్శలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే కీలకమైన స్థానాల్లో ఉన్న వారు ఇచ్చే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. వారు ఏ మాత్రం తడబడినా కూడా ఏకంగా ఆయా పార్టీలకే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అందుకే ఇపుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ మీద భిన్నంగా స్పందన వస్తోంది. నిజానికి ఫలానా వర్గానికి తాము ఎంతో చేశామని చెప్పడంలో తప్పు లేదు, కానీ వారే పార్టీ వారితోనే మేము అన్నట్లుగా ఇచ్చే ప్రకటనల వల్ల లాభం లేకపోగా బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. రాజకీయంగా వ్యూహాలతో పాటు ఎక్కడ ఎపుడు ఎలా మాట్లాడాలో తెలిసిన రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ మాత్రం ఎందుకో తడబడుతున్నారని పొరబడుతున్నారని వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్నాయి. సరే ఇంతలా ఒక వర్గాన్ని సొంతం చేసుకుని ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్ వల్ల ఫలితం సానుకూలం అయితే ఫరవాలేదు, కానీ ఏ మాత్రం రివర్స్ అయితే మాత్రం అపుడు దాని ప్రభావం ఏమిటి దాని మూల్యం ఎంత అన్నది తెలుస్తుంది అని అంటున్నారు.
