Begin typing your search above and press return to search.

మీరెలా జాతిపిత.. కడిగిపడేసిన సీఎం రేవంత్

మాటల మాంత్రికుడిగా బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరుంది. కానీ.. నిజానికి ఆ మాటను అనాల్సింది రేవంత్ రెడ్డిని.

By:  Garuda Media   |   3 Feb 2026 9:54 AM IST
మీరెలా జాతిపిత.. కడిగిపడేసిన సీఎం రేవంత్
X

మాటల మాంత్రికుడిగా బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరుంది. కానీ.. నిజానికి ఆ మాటను అనాల్సింది రేవంత్ రెడ్డిని. ఆవేశం.. ఆగ్రహం.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా. సుత్తి లేకుండా ఎదుటోడి ముఖం పగిలేలా పదునైన మాటలు.. అదే సమయంలో విషయం మిస్ కాకుండా తీసుకునే జాగ్రత్తలు చూస్తే.. సీఎం రేవంత్ టాలెంట్ కు ఫిదా కావాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఇటీవల విచారణను ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ సాధన కోసం పోరాడిన జాతిపితగా కేసీఆర్ ను పదే పదే అభివర్ణించారు. గడిచిన పది రోజులుగా విదేశాల్లో ఉండి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్.. రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఒక్కమాటలో మీరెట్ల జాతిపిత అవుతారు? అంటూ ప్రశ్నించటమే కాదు.. దానికి తగ్గట్లే తన వాదనను వినిపించటం గమనార్హం.

‘‘ఈ మధ్యన కొంతమంది వారికి వారే తెలంగాణ జాతిపిత అని ప్రకటించుకుంటున్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే.. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చారంటున్నారు. ఆయన నిజంగా తెలంగాణ జాతిపిత అయితే.. అనాటి భారత జాతిపితలా ఏ ఆదర్శాల కోసం నిలిచారో చెప్పాలి. భారత జాతిపిత ఏదైనా పదవి తీసుకున్నారా? కుటుంబం కోసం ఏమైనా అడిగారా? రాజకీయ పార్టీలు మొదలు తెలంగాణ సమాజాన్నంతా ఏకం చేసే బాధ్యతను నిర్వర్తించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఇంటి తలుపులు బద్దలు కొట్టించి మరీ పోలీసులతో ఈడ్చుకుపోయేంత నేరం ఆయనేం చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా అవమానించారో మర్చిపోయారా? ఇప్పుడు మీ తలుపులు ఎవరూ బద్దలు కొట్టలేదే? చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు అంతే కదా. అధికార నివాసానికి వస్తామని అధికారులు అంటే.. ఫామ్ హౌస్ కు వచ్చి రాసుకొమ్మంటారా? ఇదెక్కడి జాతిపిత విధానం?’’ అంటూ నిప్పులు చెరిగారు.

స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం.. మానవ హక్కుల కోసం కోట్లాడిన చేగువేరా మొదలు రావి నారాయణరెడ్డి వరకు ఎంతోమంది సర్వం కోల్పోయారన్న సీఎం రేవంత్.. ఈ సందర్భంగా కేసీఆర్ ఆస్తుల గురించి.. సంపద గురించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజల కోసం కోట్లాడిన వారు సర్వం కోల్పోయారు. ఆస్తులు.. అంతస్తులు త్యాగం చేశారు. మీలాంటి త్యాగధనులను జాతిపితలుగా.. ఉద్యమకారులుగా ప్రజలు కీర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటిరి. వందల ఎకరాల ఫామ్ హౌస్ లు మీకే వచ్చె. టీవీలు.. పత్రికలు, వేల కోట్ల రూపాయిల వ్యాపారాలు మీకే వచ్చె. చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తేరి. కాంట్రాక్టులు మీరే పంచుకుంటిరి. ఇంత చేసిన తర్వాత మీరెట్ల జాతిపిత అయితరు? ఉద్యమకారుడెలా అవుతారు? ’’ అంటూ ఒక రేంజ్ లో కడిగిపారేశారు.

శిబుసోరెన్, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, యడ్యూరప్ప లాంటి మాజీ సీఎంలు విచారణను ఎదుర్కొనలేదా? అంటూ ప్రశ్నించిన రేవంత్.. చట్టాలకు ఎవరూ అతీతులు కాదని.. తాను హార్వర్డ్ కు వెళ్లినా రాష్టర రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత తాను పాల్గొన్న తొలి సమావేశంలోనే విపక్ష నేత కేసీఆర్ మీద నిప్పులు చెరిగిన సీఎం రేవంత్.. ఆయన్ను జాతిపిత అనేందుకు ఎలాంటి అర్హత లేదన్నట్లుగా వినిపించిన వాదన గులాబీ పార్టీకి గుండెలు అదిరేలా మారిందని మాత్రం చెప్పక తప్పదు. విన్నంతనే కన్వీన్స్ అయ్యేలా ఉన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు పింకీలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.