డిసెంబరు కాంగ్రెస్ పార్టీకి మిరాకిల్ మంత్.. అదెలానో చెప్పిన రేవంత్
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన ఆయన.. వాటి పరిష్కారం గురించి హామీ ఇచ్చారు.
By: Garuda Media | 21 Dec 2025 10:18 AM ISTమనసు దోచుకునే మాటల్ని చెప్పటం అందరికి సాధ్యం కాదు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి స్వీట్ మాటలు మాట్లాడటం అరుదైన కాంబినేషన్ గా చెప్పాలి. అందరికి కనిపించే అంశాలు.. అవగాహన ఉన్న అంశాల్ని కనెక్టు చేయటం.. దానికి భావోద్వేగాన్ని రంగరించే టాలెంట్ అందరికి ఉండదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టాలెంట్ వేరే లెవల్ అన్నట్లుగా చెప్పాలి. సందర్భానికి అనుగుణంగా కొన్ని అంశాల్ని ప్రస్తావించి.. అందరూ ఇట్టే కనెక్టు అయ్యేలా మాట్లాడటంలో రేవంత్ ముందుంటారు.
తాను పాల్గొనే ఏ సభలో అయినా.. కార్యక్రమంలో అయినా సరే.. పాత విషయాన్ని కొత్తగా.. సరికొత్తగా.. ఎవరూ గమనించని అంశాల్ని అందరూ గమనించేలా.. మాట్లాడేలా చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించటం ద్వారా చాలా మందికి ఇట్టే కనెక్టు అయ్యేలా చేశారు రేవంత్. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించింది.
ఎల్ బీ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన ఆయన.. వాటి పరిష్కారం గురించి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ నోటి నుంచి వచ్చిన మాట క్రైస్తువులను మాత్రమే కాదు.. కాంగ్రెస్ ను అభిమానించి.. ఆరాధించే వారితో పాటు.. తెలంగాణ ప్రజలు సైతం ఇట్టే కనెక్టు అయ్యే మాట చెప్పారు.
డిసెంబరు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్ గా అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన మాటల్లో అర్థాన్ని ఆయన వివరిస్తూ.. ‘‘తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టిన నెల.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదే’’ అని గుర్తు చేశారు. ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2009లో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏకు చోదకశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది కూడా డిసెంబరులోనే. నిజమే.. తెలంగాణకు.. తెలంగాణ ప్రజలకు.. కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు మిరాకిల్ మంత్ అన్న రేవంత్ మాట నూటికి నూరుపాళ్లు నిజమే. ఇలాంటి కనెక్టింగ్ మాటలు రేవంత్ దగ్గర ఎక్కువే.
