రేవంత్ మార్క్ మంత్రి వర్గ విస్తరణ ?
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు కీలక విషయాలలో పూర్తిగా స్వేచ్చ ఇవ్వరని చెబుతారు.
By: Satya P | 8 April 2026 12:06 AM ISTసాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు కీలక విషయాలలో పూర్తిగా స్వేచ్చ ఇవ్వరని చెబుతారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడమే కారణం. నిర్ణయాలు అన్నీ ఢిల్లీ స్థాయిలో జరుగుతాయి. పైగా అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పెద్దలు మంత్రి వర్గం విస్తరణ వంటి వాటిలో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి దిగ్గజ నేత సీఎం గా ఉన్నా కాంగ్రెస్ లో జరిగేది ఇదే. ఇక రెండున్నర ఏళ్ళకు దగ్గర పడుతున్న తెలంగాణా కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ ఆశలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఏకంగా శాసనసభ శాసన మండలిలో బడ్జెట్ సమావేశాలలో కొందరు నేతలు ప్రభుత్వం తీరు మీద విమర్శలు చేయడం కూడా మంత్రి పదవులు దక్కకపోవడమే కారణం అని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల తరువాతనే :
ఇక దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఫుల్ బిజీగా ఉంది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి రాష్ట్రాలే పరీక్షను ఎదుర్కొంటున్నాయి. వీటిలో మెజారిటీ గెలిచినా కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం వస్తుంది. అందులో కేరళ రాష్ట్రంలో సొంతంగా అధికారం దక్కించుకుంటే కాంగ్రెస్ మరింతగా ధీటుగా నిలబడుతుంది. ఆ మీదట తెలంగాణాలో మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు అని అంటున్నారు.
రెండు ఖాళీలతో పాటు :
ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ మంత్రివర్గంలో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అజారుద్దీన్ ఏ సభలో సభ్యుడు కారు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కకపోతే ఆయన పదవి కూడా పోతుంది. మళ్ళీ ఆయనకే ఆ పదవి ఇవ్వాలన్నా మంత్రి వర్గ విస్తరణ జరపాల్సి ఉంది. అంతే కాదు కొందరు మంత్రుల పనితీరు మీద అసంతృప్తి ఉంది అని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ధీటైన వారిని తీసుకోవాలని సామాజిక సమీకరణలు రాజకీయ ఎత్తుగడలను పాటిస్తూ మంత్రి వర్గం కూర్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు కనీసంగా ఆరేడు మందిని కొత్తగా తీసుకోవచ్చు అని ప్రచారం సాగుతోంది. కానీ దానికి మూడింతలు పైగా ఆశావహులు రేసులో ఉన్నారు.
ఎన్నికల బృందం కోసం :
ఇక తెలంగాణా రాష్ట్రానికి 2028 చివరిలో ఎన్నికలు ఉన్నాయి. అంటే మరో రెండున్నరేళ్ళలో అన్న మాట. ఇప్పటి నుంచి గట్టిగా సర్దుకుంటే మరోసారి పార్టీని అధికారంలోకి తేగలమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అంటున్నారు. అందుకోసం తన ఎన్నిక బృందాన్ని తయారు చేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఎంత మందిని తప్పించి ఎంత మంది కొత్త వారిని చేర్చుకోవాలి ఎక్కడ ఎవరికి చాన్స్ ఇవ్వాలి ఇవన్నీ రేవంత్ రెడ్డి పూర్తి కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు.
హైకమాండ్ హ్యాండ్ తోనే :
అయితే కాంగ్రెస్ లో హైకమాండ్ అన్నది అత్యంత కీలకం. పైగా ఆశావహులు అంతా హై కమాండ్ నే ఆశ్రయిస్తారు. వారి నుంచే ఫలానా వారిని తీసుకోవాలని కూడా చెబుతారు అని అంటున్నారు. దాంతో ముఖ్యమంత్రి తాను కోరుకున్న మంత్రి వర్గం కూర్పుతో విస్తరణను చేపట్టగలరా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే కేరళ ఎన్నికల తరువాత కాంగ్రెస్ గెలుపు ఉత్సాహంలో ఉంటే మాత్రం తెలంగాణా సీఎం ఆశలు నెరవేర వచ్చు అంటున్నారు. పైగా కేరళ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ రేవంత్ రెడ్డి ప్రచారం గట్టిగా చేశారు. మొత్తానికి చూస్తే మే నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు అని టాక్ నడుస్తోంది.
