Begin typing your search above and press return to search.

రేవంత్‌కు కొత్త చిక్కు.. బ‌య‌ట ప‌డేదెలా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను అయితే.. తీసుకున్నారు .

By:  Garuda Media   |   18 Nov 2025 11:00 PM IST
రేవంత్‌కు కొత్త చిక్కు.. బ‌య‌ట ప‌డేదెలా?
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను అయితే.. తీసుకున్నారు . కానీ, వారి వ్య‌వ‌హారంలో త‌లెత్తిన వివాదం నుంచి మాత్రం బ‌య‌ట‌కు రాలేక పోతున్నారు. దాదాపు 12-15 మాసాలుగా ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా న‌లుగుతూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూనే ఉంది. రాజకీయంగా ఈ విష‌యాన్ని ఎదుర్కొనే క్ర‌మ‌మైతే బాగానే ఉండేది. కానీ, బీఆర్ ఎస్ పోయిపోయి న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యించింది. ప‌ట్టుబ‌ట్ట నేల‌.. అన్న‌ట్టే బీఆర్ ఎస్ వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఈ క్ర‌మంలోనే స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు సుప్రీంకోర్టు ఇప్ప‌టికే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను విధించింది. ఈ ఏడాది జూలై 31న ఇచ్చిన తీర్పులోనే జంపింగుల విష‌యాన్ని మూడు మాసాల్లో.. అంటే అక్టోబ‌రు 31 నాటికి తేల్చేయాల‌ని పేర్కొంది. దీంతో ఆ ప‌ది మంది జంపింగు ల విష‌యంపై స్పందించిన స్పీక‌ర్‌.. విచార‌ణ‌కు పిలిచారు. అయితే.. ఈక్ర‌మంలో విచార‌ణ విష‌యంలోనూ అనేక మ‌లుపులు చోటు చేసుకున్నాయి. బీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలిచిన తాము ఆ పార్టీలోనే ఉన్నామ‌ని.. విచార‌ణ‌కు వ‌చ్చిన వారు చెప్పారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను త‌మ దేవుడు అన్నారు. రాముడు అన్నారు.

దీంతో విచార‌ణ నివేదిక‌లో ఏం రాయాలి? వారిని ఏం చేయాలి? అన్న‌ది ప్ర‌సాద‌రావుకు కొరుకుడు ప‌డ‌డం లేద‌న్న స‌మాచారం ఉంది. మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు విచారించింది కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే మ‌రో ఆరుగురు వేచి చూస్తున్నారు. ఇంత‌లో స‌మ‌యం క‌రిగిపోగా.. మ‌రో రెండు మాసాల గ‌డువు కోరుతూ.. సుప్రీంకోర్టు గ‌డ‌ప త‌ట్టారు. ఇక్క‌డే అస‌లు అతి పెద్ద స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. ``మీరు తేలుస్తారో..మ‌మ్మ‌ల్ని తేల్చ‌మంటారో చెప్పండి!`` అంటూ సుప్రీంకోర్టు ఘీంక‌రించింది. అయితే.. సుప్రీంకోర్టు తేలుస్తామ‌న్న‌ది.. జంపింగుల విష‌యం కాదు. స్పీక‌ర్ విష‌యం!!.

తాము పెట్టిన డెడ్‌లైన్‌లో గా ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న‌ది సుప్రీం గ‌ద్దింపు. సో.. మొత్తానికి మ‌రో 4 వారాలు గ‌డువు ఇచ్చినా.. ఇంత‌లో ఈ జంపింగుల‌పై ఏం చేయాల‌న్న‌ది ప్ర‌శ్న‌. వారిపై ఎలాంటి నివేదిక ఇచ్చినా.. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అనేది అధికార‌ప‌క్షంలో గుబులు. ఇక‌, దీనికి తార‌క మంత్రం ఏంటి? అనే విష‌యంపై ప్ర‌భుత్వ పెద్ద‌లు దృష్టి పెట్టారు. దీనిని తెంచుకునే క‌న్నా.. ఏదో ఒక విధంగా ముడి వేయాల‌ని.. భావిస్తున్నారు. పైగా.. మ‌రో నాలుగు వారాల్లో దీనిపై ప‌రిష్కారం చూప‌క‌పోతే.. స్పీక‌ర్ ప‌ద‌వికే ఎస‌రు వ‌చ్చేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.