'సర్'పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్లు
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)-సర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 19 Jan 2026 10:00 AM ISTకేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)-సర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఓటు హక్కును తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన కీలక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. పేదలను ఇప్పటికే అన్నింటికీ దూరం చేశారని.. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కును కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య తెలంగాణలోనూ సర్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాదాన్యం సంతరించుకున్నారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కామ్రెడ్లు.. గజమాలతో స్వాగతించారు. అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటీష్ వారి కంటే కూడా.. బీజేపీనే అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
బ్రిటీష్ వాళ్లు భారత దేశాన్ని, ప్రజలను కూడా విభజించి పాలించే సూత్రాన్ని అమలు చేశారని.. పేదల ను మాత్రం వారు పట్టించుకోలేదని వదిలేశారని చెప్పారు. కానీ, ఇప్పుడు బ్రిటీష్ వారికంటే కూడా ఘోరం గా బీజేపీ.. పేదలపైనే ఉక్కుపాదం మోపుతోందని సీఎం చెప్పారు. పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసిందని.. పేదల ఓటు హక్కును సర్ ప్రక్రియ ద్వారా తొలగిస్తోందని వ్యాఖ్యానించారు. మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
కమ్యూనిస్టులతో కలిసి కొట్లాడితేనే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రేవంత్ చెప్పారు. దున్నేవాడిదే భూమి అని ఆనాడు కమ్యూనిస్టులు పిలుపునిచ్చారని తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. కమ్యూనిస్టుల సూచనలతోనే ఆనాడు 2004-05 మధ్య ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరుపుతున్న పోరుకు.. కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
