సైమన్ గో బ్యాక్.. సర్ గో బ్యాక్.. రేవంత్ సంచలనం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేరుగా టార్గెట్ చేసేలా మాట్లాడే అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో రేవంత్ ఒకరు. తాజాగా అసోంకు చెందిన ప్రతిదిన్ దినపత్రిక నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు.
By: Garuda Media | 29 Sept 2026 5:09 PM ISTబీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత మాటకారి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరుషంగా మాట్లాడటమే కాదు.. అవసరానికి అనుగుణంగా కాస్తంత సెన్స్ బుల్ గా మాట్లాడటం రేవంత్ లో ఉన్న క్వాలిటీగా చెప్పొచ్చు. అదే సమయంలో అందరికి అర్థమయ్యేలా తెలుగులో మాత్రమే కాదు.. ఇంగ్లిషు.. హిందీలోనూ మాట్లాడే నేర్పు రేవంత్ కు కాస్తంత ఎక్కువే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేరుగా టార్గెట్ చేసేలా మాట్లాడే అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో రేవంత్ ఒకరు. తాజాగా అసోంకు చెందిన ప్రతిదిన్ దినపత్రిక నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా ఓటర్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను అడ్డుకునేందుకు దేశ ప్రజలంతా ఏకం కావాల్సిన రోజు వచ్చిందన్న పిలుపునిచ్చారు. అంతేకాదు.. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అప్పట్లో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ.. సర్ గో బ్యాక్ నినాదాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా జాతీయ స్థాయిలో అందరి కంట్లో పడటం గమనార్హం.
సైమన్ గో బ్యాక్ అని అప్పట్లో దేశ ప్రజలంతా ఏకమై ఉద్యమాన్ని నడిపినట్లే.. ఇప్పుడు సర్ కు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఏకమై.. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. సర్ ను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ.. శరద్ పవార్.. ఉద్దవ్ ఠాక్రే.. స్టాలిన్ తదితర విపక్ష నేతలంతా ఏకమవుతారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్షంగా ఎన్నికల సంఘం నిర్మాణాన్ని తన సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లుగా మండిపడ్డారు.
బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీగా మారిందన్న సీఎం రేవంత్.. రాజ్యాంగ సభలో సుదీర్ఘంగా చర్చించి ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించారనన ఆయన.. ‘ఆ తర్వాత జరిగిన అన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ల(సర్)లో ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించటమే లక్ష్యంగా పని చేశారు. మొదటిసారి ఓట్లు తొలగించటానికి దీన్ని దుర్మార్గంగా వాడుతున్నారు. దేశంలో జనాభా పెరుగుతుంటే ఓట్లు మాత్రం ఎందుకు తగ్గుతున్నాయి? మోడీ.. సీఈసీలు కలిపి కోట్ల కొద్దీ ఓట్లను తొలగిస్తున్నారు. 2014లో మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో 81 కోట్ల ఓట్లు ఉంటే.. 2019 నాటికి 91 కోట్లకు.. 2024 నాటికి 97 కోట్లకు చేరాయి. తాజాగా ఇప్పుడు 13 కోట్ల ఓట్లు తొలగించారు. వీటితో పాటు మరిన్ని ఓట్లనుకొర్రీలతో తొలగిస్తున్నారు. మొత్తంగా 30 కోట్ల ఓట్లు తొలగించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు’’ అంటూ చేసిన విశ్లేషణ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా మారింది.
వాట్సాప్.. సోషల్ మీడియాలో పోస్టుటు పెడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఓట్లు తొలగిస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. మోడీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లు మాత్రమే ఉండేలా కుట్ర పన్నుతున్నట్లుగా ఆరోపించారు. బూత్ స్థాయి అధికారికి.. కలెక్టర్ కు ఉండే అధికారాలను సైతం ఢిల్లీలో కూర్చున్న ఎన్నికల సంఘం తన గుప్పిట్లో తీసుకోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏఐ టెక్నాలజీని వాడి ఓట్లను తొలగిస్తున్నట్లుగా ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను ఉత్తరకొరియాకు పంపాలన్నారు. ఆయన్ను కిమ్ దగ్గర శిక్షణ ఇప్పిస్తే.. ప్రధాని మోడీకి దేశంలో నూటికి నూరుశాతం ఓట్లు వేయిస్తారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
సర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ చేపట్టొద్దని.. 1976, 2001 మాదిరి ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యను మరో పాతికేళ్ల పాటు ఫ్రీజ్ చేయాలన్నారు. డీలిమిటేషన్ చేస్తే.. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాభవాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుందన్నారు. ఉమ్మడి ఏపీలో ఏపీకి 175 అసెంబ్లీ స్థానాలు ఉండేవని.. తెలంగాణకు 119 స్థానాలు ఉండేవని.. దీంతో ఎప్పుడూ వారు తమపై పెత్తనం చేసేవారననారు. వారి అధిపత్యాన్నీ చూసీ చూసీ పోరాడి తెలంగాణ సాధించుకున్నట్లుగా చెప్పారు.
సమాజంలో మైనార్టీలను అణిచివేస్తే విప్లవం వస్తుందన్న రేవంత్.. ఇందిరాగాంధీ.. రాజీవ్ గాంధీ హయాంలో దక్షిణాదికి రాష్ట్రపతి పదవులతో పాటు రక్షణ.. ఆర్థిక.. హోంశాఖ లాంటి కీలక పదవులు దక్కాయన్నారు. మోడీ కోరుకున్నరీతిలో డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి కేంద్రంలో ప్రాధాన్యం పూర్తిగా తగ్గుతుందన్నారు. మొత్తంగా ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీపై నేరుగా మాటల్ని తూటాల మాదిరి గురి పెట్టిన వైనం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ఈ తరహాలో ఇంత ఘాటుగా మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రులు లేరన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో రేవంత్ ఒకేఒక్కడిగా మారినట్లుగా పేర్కొంటున్నారు.
