కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా?
తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 2 Nov 2025 2:20 PM ISTతెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
* కేటీఆర్ సోదరి కవితపై రేవంత్ సానుభూతి
రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కవిత కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా ఆమె తన ఇంటి నుంచి వెలివేయబడ్డారని ఆరోపించారు. ఈ ఘటనతో కవిత కన్నీరు పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. "తన సొంత చెల్లిని కాపాడలేని వ్యక్తి, ప్రజల సమస్యల కోసం ఏం చేస్తాడు? కవిత వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించు ముందు, కేటీఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడటానికి న్యాయం ఉందా?" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
* బీఆర్‌ఎస్–బీజేపీ 'రహస్య ఒప్పందం'పై మరోసారి గుస్సా
ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉన్న 'రహస్య ఒప్పందం'ను ప్రస్తావించారు. కవితకు ఆమెకు దక్కాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుట్ర పన్నారని, ఈ రెండు పార్టీలు పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
* కవిత పరోక్ష విమర్శలు: కుటుంబ కలహాలు బహిరంగం?
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఇటీవల కవిత కూడా తన సోదరుడు కేటీఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. "తన బావ ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేస్తారు?" అని ఆమె చేసిన వ్యాఖ్యలు కుటుంబంలో నెలకొన్న అంతర్గత ఉద్రిక్తతలను బయటపెట్టాయని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కుటుంబంలో నెలకొన్న సమస్యలను.. విభేదాలను స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
* కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పాలనలో అభివృద్ధి , పారదర్శకతకు పెద్ద పీట వేస్తామని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్-కవిత మధ్య ఉన్న సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ శిబిరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
