రండి చేతులు కలపండి.. పార్టీలకు రేవంత్ పిలుపు
హైదరాబాద్ విస్తరణ సహా అభివృద్దిలో అందరి భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామన్నారు.
By: Garuda Media | 24 March 2026 12:00 AM ISTహైదరాబాద్ విస్తరణ సహా అభివృద్దిలో అందరి భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకుందామన్న ఆయన.. అభివృద్ధి విషయంలో వచ్చి కలిసి పనిచేయాలని.. బలమైన సహకారం అందించాలని సూచించారు. సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
శాసన మండలిలో సోమవారం మాట్లాడిన సీఎం.. హైదరాబాద్ అభివృద్దిని ప్రస్తావించారు. గతంలో గుజ రాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్‌లను అభివృద్ది చేసినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించా రని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా సహకరించాలని సూచించారు. బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని కోరారు. 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ను డెవలప్ చేస్తున్నామన్నారు. తద్వారా కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి.. క్యూర్-ప్యూర్-రేర్ ఫార్ములాను అమలు చేస్తున్నట్టుగానే.. హైదరాబాద్ అభివృద్ధికి, ముఖ్యంగా కాలుష్య రహితంగా.. ట్రాఫిక్ కష్టాలు రాకుండా చూసేందుకు కూడా.. ఇదే ఫార్ములాను అనుసరించనున్నట్టు తెలిపారు. తద్వారా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించే ప్రయత్నం చేస్తున్నా మన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మెట్రోను ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుందని.. తద్వారా మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ట్రాఫిక్ నియంత్రణతో పాటు కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవలకు తరలించనున్నట్టు సీఎం ప్రకటించారు. అలానే.. మరో 76 కిలో మీటర్ల మేరకు మెట్రో విస్తరణకు కట్టుబడి ఉన్నామన్నారు. తద్వారా.. హైదరాబాద్‌కు వచ్చే శివారు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయని.. కానీ.. రాజకీయ కారణాలతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరించేందుకు నేతలు అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
