80ల నాటి లుక్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సీఎం
నిత్యం రాజకీయం.. పదునైన విమర్శలు.. అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా కాలంలో వెనక్కి వెళ్లారు.
By: A.N.Kumar | 10 Sept 2026 1:20 PM ISTనిత్యం రాజకీయం.. పదునైన విమర్శలు.. అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా కాలంలో వెనక్కి వెళ్లారు. అదేదో టైమ్ మెషిన్ ఎక్కి కాదు లెండి.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దయవల్ల.. రోజువారీ పొలిటికల్ డ్రామా నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లున్నారు.. 1980ల కాలం నాటి రెట్రో లుక్‌లోకి మారిపోయి నెటిజన్లకు పెద్ద షాకే ఇచ్చారు.
సరిగ్గా 80ల నాటి ఫిల్టర్ తగిలించి.. అప్పటి కాలపు బ్రౌన్ షేడ్స్, జుట్టు విరబోసుకున్న హెయిర్ స్టైల్, రెట్రో షర్ట్‌తో మెరిసిపోతున్న తన ఏఐ రూపాన్ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాధారణంగా రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు తెరవగానే ప్రెస్ మీట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విపక్షాలపై విమర్శల హోరే కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న నాయకుడే స్వయంగా ఈ "వింటేజ్ ఏఐ ట్రెండ్"లో దూకడంతో నెటిజన్ల కళ్ళు బైర్లు కమ్మాయి. "అన్న హెయిర్ స్టైల్ చూశారా.. అప్పట్లో ఈ లుక్‌తో తిరిగితే కచ్చితంగా ఏదో ఒక సినిమాలో హీరో ఆఫర్ వచ్చి ఉండేది" అంటూ ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక రాజకీయాల్లో పొత్తులు, సభలు ఎంత ముఖ్యమో.. యువత ఓట్లను ఆకట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్, మీమ్స్ కూడా అంతే ముఖ్యమని రేవంత్ రెడ్డి బాగా గ్రహించినట్లున్నారు. పాలనలో "స్పీడ్" చూపిస్తున్న సీఎం గారు.. డిజిటల్ ట్రెండ్స్‌లో కూడా "మాస్" అనిపించుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి వేసిన ఈ ఏఐ బాట చూసి.. ఇప్పుడు విపక్ష నాయకులలో కూడా టెన్షన్ మొదలై ఉంటుంది. రేవంత్ 80ల లుక్ తెచ్చారు కదా.. మరి మేమేం తక్కువ తిన్నామా అని రేపో మాపో మిగతా నేతలు కూడా 70ల నాటి బెల్ బాటమ్ ప్యాంట్లు, ఎన్టీఆర్-కృష్ణ ల్యాండ్ మార్క్ లుక్స్‌తో ల్యాండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి నిత్యం వేడివేడిగా ఉండే తెలంగాణ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి తన వింటేజ్ అవతారంతో కాస్త వినోదాన్ని.. ట్రెండీ కలర్‌ను నింపారని చెప్పవచ్చు.
