రేవంత్ వేట షురూ చేస్తాడా... చేతులెత్తేస్తాడా..?
పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అవ్వడంతో పాటు పార్టీ అధిష్టానం సైతం నేతల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు
By: Garuda Media | 25 Aug 2026 1:00 AM ISTప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అవ్వడంతో పాటు పార్టీ అధిష్టానం సైతం నేతల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి. చిన్నారెడ్డిల వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని హైకమాండ్ భావిస్తోంది.
ఒకరిని చూసి మరొకరు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో, ఇక ఆలస్యం చేస్తే పరిస్థితులు చేయిదాటిపోతాయని భావించిన అధిష్ఠానం చర్యలు తీసుకునే ఆలోచన చేస్తోందట. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతోంది. ఇలాగే ఉపేక్షించుకుంటూ పోతే మరింత మంది ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ పార్టీని మరింత బలహీనం చేస్తారని.. అప్పుడు ముఖ్యమంత్రి, పార్టీ హై కమాండ్‌కు పార్టీ నాయకుల విషయంలో పట్టులేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తుందట.
ఈ క్రమంలోనే ముందుగా క్రమశిక్షణ లైన్ దాటేసి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తోన్న నేతల విషయంలో చర్యలు తీసుకుంటే తర్వాత ఒక్కొక్కరు లైన్‌లోకి వస్తారని లెక్కలు వేస్తున్నారు. అందుకే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఆ నేతలపై ఇతర ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నట్టు గాంధీభవన్‌లో చర్చలు మొదలయ్యాయి.
గతంలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్దిచెప్పే యత్నం చేసినా, తాజాగా ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు.
ఇక మాజీ మంత్రి వనపర్తికి చెందిన చిన్నారెడ్డి ఇచ్చిన వివరణను కూడా కమిటీ పరిశీలిస్తోంది. ఇక రాజ్‌గోపాల్ రెడ్డి పదేపదే కామెంట్లు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే పార్టీ లైన్ దాటుతోన్న వారిలో కొందరిపై చర్యలు తీసుకుంటే అది లైన్ దాటుతోన్న మిగిలిన నేతలకు వార్నింగ్‌గా ఉంటుందని పార్టీ ఇంటర్నల్ టాక్ ? మరి రేవంత్ ఇలాంటి నేతల విషయంలో వేట షురూ చేస్తాడా ? రిస్క్ చేసే ధైర్యం లేక చేతులు ఎత్తేస్తాడా ? అన్నది చూడాలి.
