కేసీఅర్ అరెస్ట్: కాంగ్రెస్ బీజేపీ ఒకరి భుజాల మీద మరొకరి తుపాకీ !
తెలంగాణా రాజకీయాల్లో కేసీఅర్ శిఖరాయమానమైన కీర్తిని గడించారు. ఆయన తెలంగాణాను సాధించిన నాయకుడిగా జనం గుండెలలో నిలిచారు.
By: Satya P | 9 Feb 2026 9:27 AM ISTతెలంగాణా రాజకీయాల్లో కేసీఅర్ శిఖరాయమానమైన కీర్తిని గడించారు. ఆయన తెలంగాణాను సాధించిన నాయకుడిగా జనం గుండెలలో నిలిచారు. రెండు సార్లు సీఎం గా పనిచేశారు. ఏడు పదులు దాటిన వయసులో కేసీఅర్ ప్రస్తుతం ఉన్నారు. ఇక ఆయన పార్టీ బీఆర్ఎస్ అయితే విపక్షంలో ఉంటూ రాజకీయ పోరాటం చేస్తోంది. కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ రెండూ అయితే గట్టిగానే మాట్లాడుతూ వస్తున్నాయి. ఆయన ప్రభుత్వంలో అనేక పొరపాట్లు జరిగాయని నిందిస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ అరెస్టు ఎవరు చేయాలి అంటే మాత్రం భుజాలు తడుముకుంటూ ఉంటాయి.
బీజేపీ మీదకు నెపం :
ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ ని అరెస్టు కాకుండా కాపాడుతున్నది బీజేపీ అంటూ తాజాగా ఆరోపించారు. లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని దాని మీద కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టి ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారు కేసీఆర్ విషయంలో ఎందుకు ఆ పని చేయరని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు. తెర వెనక ఏ రకమైన లోపాయికారీ తనంతో ఈ అరెస్టులు చేయడం లేదని కూడా ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఏం చేస్తోంది అంటూ :
ఇక కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ ని అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని ఆయన అంటున్నారు. ఆ పని చేయకుండా తమ మీద విమర్శలు ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ విచారణలు తెలంగాణాలో జరుపుతున్నారు, కేసీఆర్ కుటుంబాన్ని పిలుస్తున్నారు కానీ అరెస్టులు అయితే లేవు, దీని మీదనే బీజేపీ నేతలు కాంగ్రెస్ ని నిగ్గదీస్తున్నారు.
అంత ఈజీ కాదా :
ఇదిలా ఉంటే కేసీఆర్ ని అరెస్ట్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ సీనియర్ మోస్ట్ నేత మాత్రమే కాదు ఉద్యమ నేత. ఆయన ఫాం హౌస్ కి పరిమితం అయి ఉన్నా అరెస్ట్ కనుక చేస్తే ఆ తరువాత సీన్ ఎలా మారుతుందో తెలియదన్న విశ్లేషణలు ఉన్నాయి. కేసీఆర్ అరెస్ట్ కనుక నిజంగా జరిగితే జనాల మూడ్ కూడా మారుతుందని బీఆర్ఎస్ కి ఒక్క సారిగా సానుభూతి వస్తుందని అన్న మాట సైతం ఉంది.
ఎదుటి పార్టీ ద్వారా :
అందుకే కేసీఆర్ అరెస్ట్ జరగాలి కానీ తమ చేతికి మట్టి అంటకుండా ఎదుటి పార్టీ భుజాల మీద తుపాకీ మోపి ఆ విధంగా అరెస్ట్ కార్యం నెరవేర్చాలని రెండు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయని అంటున్నారు. కేంద్రమే అరెస్ట్ చేస్తే మాకేమి సంబంధం లేదని రాష్ట్రం తప్పించుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ అరెస్ట్ చేస్తే బీజేపీ దానిని అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఏ పెద్ద నాయకుడిని అయినా అరెస్టు చేస్తే మరుసటి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవడం జరుగుతోంది. దానికి ఏపీలో జగన్, చంద్రబాబు ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చి గ్రాఫ్ పెంచుకుని సీఎం అయిపోయారు. సో కేసీఆర్ అరెస్ట్ అంటే కేవలం మాటలనే పరిమితం అవుతారు తప్ప చేతలకు దిగరన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
