Begin typing your search above and press return to search.

72వ సారి.. ఢిల్లీకి సీఎం రేవంత్..ఈసారి ఎజెండా ఏంటి?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుతున్న 72వ ఢిల్లీ పర్యటనగా చెప్పాలి.

By:  Garuda Media   |   22 Jun 2026 1:11 PM IST
72వ సారి.. ఢిల్లీకి సీఎం రేవంత్..ఈసారి ఎజెండా ఏంటి?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుతున్న 72వ ఢిల్లీ పర్యటనగా చెప్పాలి. పార్టీ కార్యక్రమాలు.. మరోవైపు కేంద్రప్రభుత్వంతో సమన్వయం చేసుకోవటం.. ఏతావాతా సీఎం రేవంత్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేయాల్సి వస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరులో ఆయన ఢిల్లీ పర్యటనలు ఉండటం విశేషం. తాజాగా ఆయన రెండు రోజులు (జూన్ 22-23) ఢిల్లీలోనే ఉండనున్నారు.

తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికి వాటిని ఆయన లెక్క చేయటం లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు.. కేంద్రంలోని ప్రభుత్వంలో ఘర్షణతో కాకుండా.. ప్రొఫెషనల్ పద్దతిలో అనుకున్నది సాధించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నట్లు చెబుతున్నారు.

అధికారులను కేంద్రమంత్రుల వద్దకు పంపే కన్నా.. ముఖ్యమంత్రి హోదాలో జరిపే చర్చలు ఫలవంతం అవుతాయన్నట్లుగా సీఎం తీరు ఉందని చెప్పాలి. మరి.. ఆయన ప్లాన్ వర్కువుట్ అవుతుందా? అంటే కొంత మేర అన్న సమాధానం వస్తుంది. పదేళ్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కారుతో కొంతకాలం స్నేహపూర్వకంగా.. మరికొంతకాలం ఘర్షణ తీరును ప్రదర్శించింది. స్నేహపూర్వకంగా వ్యవహరించినప్పుడు సైతం సాధించటం సాధ్యం కాని కొన్ని అంశాలను సీఎం రేవంత్ సాధించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తంగా చూస్తే.. తరచూ ఢిల్లీ పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రిగా రేవంత్ మీద ముద్ర పడినప్పటికి.. అందుకు తగ్గ ఫలితం పెద్ద ఎత్తున కాకున్నా.. కొంతమేర లభించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. తాజా ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ షెడ్యూల్ చూస్తే.. ఆయన హస్తిన పర్యటన అవసరాల్ని తెలిపేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు పలువురు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్లు కోరటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. హైదరాబాద్ మెట్రోరైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు విస్తరణ అనుమతులు..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మెట్రో ఫేజ్ 1కు సంబందించిన రుణ పునరుద్ధరణకు సంబంధించిన నిధులు తెలంగాణ రాష్ట్ర అకౌంట్ లో జమ కాకుండా నిలిచిపోయిన నేపథ్యంలో.. ఈ ఇష్యూను క్లియర్ చేయటం ఇప్పుడు ఆయనకు తప్పనిసరి అయ్యింది.

ఈ అంశం మీదనే గత వారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేయటం తెలిసిందే. ఓవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తప్పు పడుతూనే.. మరోవైపు మరికొందరు కేంద్రమంత్రుల్ని కలిసి.. తమ అభ్యర్థనల విషయంలో సానుకూలంగా స్పందించాలన్న తీరు ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసిన రాయదుర్గం భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఇష్యూను క్లియర్ చేయటం కూడా తాజా ఢిల్లీ టూర్ ఎజెండాలో ఒక అంశంగా చెబుతున్నారు.

రాష్ట్రానికి రావాల్సిన పలు పన్ను బకాయిలు.. కేంద్ర నిధుల విడుదలపైనా చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణకు అవసరమైన ఎరువుల కోట పెంపు అంశంపై చర్చకు సదరు కేంద్రమంత్రితో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. పాలనా సంబంధమైన అంశాల లెక్క ఇలా ఉంటే.. మరోవైపు పార్టీకి సంబంధించిన అంశాల విషయంలోనూ రేవంత్ బిజీ షెడ్యూల్ తో ఉండటం గమనార్హం. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ లాంటి అగ్రనేతల్ని తాజా పర్యటన సందర్భంగా కలవనున్నారు.

అంతేకాదు.. గడిచిన కొంతకాలంగా పెండిగ్ లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపైనా అధినాయకత్వంతో మాట్లాడనున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకం మీదా సీఎం రేవంత్ చర్చలు జరుపుతారన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో 72వ సారి వెళ్లిన రేవంత్.. తాజా పర్యటనలో ఏం సాధిస్తారన్నది చూడాలి.