68 కిలోల ‘స్థిరమైన’ బరువు.. సీఎం రేవంత్ కు అరుదైన మైలురాయి!
ఈ పర్యటనలో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రధాన అంశం సీఎం రేవంత్ రెడ్డి తులాభారం తూగడమే.. కాటా మీద కూర్చున్న ముఖ్యమంత్రి గారి బరువు సరిగ్గా 68 కిలోలుగా నమోదైంది.
By: A.N.Kumar | 16 Aug 2026 11:35 PM ISTమేడారం వనదేవతల సన్నిధిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన ‘తులాభారం’ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించేందుకు మేడారం చేరుకున్న సీఎం.. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు నిలువెత్తు ‘బంగారం’ (బెల్లం) సమర్పించి తన మొక్కులు తీర్చుకున్నారు.
ఈ పర్యటనలో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రధాన అంశం సీఎం రేవంత్ రెడ్డి తులాభారం తూగడమే.. కాటా మీద కూర్చున్న ముఖ్యమంత్రి గారి బరువు సరిగ్గా 68 కిలోలుగా నమోదైంది. విశేషమేమిటంటే గతేడాది సెప్టెంబర్‌లో కూడా మేడారంలో నిర్వహించిన తులాభారంలో ఆయన బరువు ఖచ్చితంగా ఇదే 68 కిలోలు..
రాజకీయాల్లో పదవులు మారినా.. పథకాలు మారినా, ప్రతిపక్షాల విమర్శల దాడులు పెరిగినా.. చివరకు కేబినెట్ మీటింగ్‌లలో తీవ్రమైన చర్చలు సాగినా... ముఖ్యమంత్రి గారి శరీర బరువు మాత్రం గ్రాము కూడా అటూ ఇటూ కాకుండా అట్లే ఉండిపోవడం నిజంగా ఒక అద్భుతమే అని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. “పాలనలో ఎంత భారమున్నా.. డిజిటల్ కాటా ముందు మాత్రం మన రేవంతే స్థిరమైన విక్రమార్కుడు” అని కాంగ్రెస్ శ్రేణులు పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఈ ‘స్టేబుల్ వెయిట్’ వెనుక ఉన్న రహస్య డైట్ ఏమిటో తెలిస్తే సామాన్యులకు కూడా కాస్త ఉపయోగపడుతుందేమో అని విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.
ముందస్తు రాఖీ సంబరం..
ఇక ఈ మేడారం పర్యటనలో మరో భావోద్వేగ, ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ముందుగానే ఆయనకు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమికి ఇంకా సమయం ఉన్నప్పటికీ అన్న విదేశీ పర్యటనలో ఉంటారనే కారణంతో చెల్లెలు సీతక్క ముందస్తుగా రాఖీ కట్టి తన ఆత్మీయతను చాటుకున్నారు. ఒకవైపు వనదేవతల ఆశీస్సులు, మరోవైపు చెల్లెలి ముందస్తు రాఖీ దీవెనలు.. రెండూ తోడవడంతో సీఎం విదేశీ పర్యటన సూపర్ హిట్ కావడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఏది ఏమైనా కొత్త పెన్షన్ల పంపిణీ సరేసరి.. 68 కిలోల తులాభారం ముచ్చట మాత్రం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా సోషల్ మీడియా రాయుళ్లకు కావలసినంత సరదా ముచ్చటను అందించింది.
