Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫాం హౌసులో ఆక్రమణలు.. 30 రోజుల్లో తేల్చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

కాగా, అసెంబ్లీలో భూ ఆక్రమణలు, 22ఎ సమస్యపై సుదీర్ఘంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ రికార్డులను చదవి వినిపించారు.

By:  Tupaki Political Desk   |   16 Sept 2026 6:03 PM IST
కేసీఆర్ ఫాం హౌసులో ఆక్రమణలు.. 30 రోజుల్లో తేల్చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X

తెలంగాణలో 22ఎ భూ సమస్య అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్రంలో పేద రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న 22ఎ సమస్యపై బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22ఏ సమస్య ఎలా ఉత్పన్నమైందో వివరిస్తూ సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో భూ రికార్డులను డిజటలరీకరణ చేస్తామని పేరు చెప్పి పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చారంటూ సీఎం మండిపడ్డారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర బీఆర్ఎస్ నేతలు కలిసి రాష్ట్రంలో వందల ఎకరాలను ఆక్రమించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కు చెందిన ఎర్రవెళ్లి ఫాం హౌసులో ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూములపై విచారణకు ఆదేశిస్తున్నామని, 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

బీఆర్ఎస్ కారణంగానే సమస్య జటిలం

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22ఏ భూ సమస్యలపై చేసిన ప్రసంగం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఈ సమస్యపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను అన్నింటికి ఒకేసారి సమాధానం చెబుతానని ఓపికగా ఎదురుచూశానని వెల్లడించారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో సమాధానం చెప్పాలని భావించానని, అందుకే ఆయన అసెంబ్లీకి రావాలని కోరినట్లు వివరించారు. కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించినని హామీ ఇచ్చినా, ఆయనతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభకు హాజరుకాకపోవడానికి పెద్ద కారణమే ఉందన్నారు. 22ఎ సమస్యపై తాను వివరాలు సేకరిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతల బండారం బయటపడిందని, వారి భూదోపిడీని నిలదీస్తాననే కారణంగానే మాజీ మంత్రి హరీశ్ రావు సూచనలతో కేసీఆర్ సభకు రాలేదని, అంతేకాకుండా అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజు నుంచే ఇందుకు తగిన ప్రణాళికలు రచించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఎర్రవెల్లి ఫాంహౌసులో 388 ఎకరాల ఆక్రమణ

తెలంగాణలో భూ సమస్యలు రావడానికి స్పష్టమైన కారణాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సమస్య మరింత జటిలమైందని ఆరోపించారు. ప్రధానంగా భూ రికార్డులను డిజిటలరీకరణ చేస్తామన్న పేరుతో లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌసుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేవలం 27 ఎకరాల భూమి మాత్రమే ఉండాల్సివుండగా, కేసీఆర్, ఆయన సతీమణి శోభకు కలిపి ఏకంగా 67.5 ఎకరాల భూమి ఉందని వెల్లడించారు. అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ తోపాటు ఆయన భార్య, పిల్లల పేరున 123.5 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. మొత్తం కేసీఆర్ ఫాం హౌసులో 700 ఎకరాలు ఉండగా, దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ భూములకు ఆధారాలు చూపాలని కేసీఆర్ కు నోటీసిలు జారీ చేస్తామని వెల్లడించారు.

కుటుంబంలో ఎవరికి ఎంత?

కాగా, అసెంబ్లీలో భూ ఆక్రమణలు, 22ఎ సమస్యపై సుదీర్ఘంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ రికార్డులను చదవి వినిపించారు. ఈ విషయంలో బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. మహేశ్వరరెడ్డి పెద్ద భూస్వామి అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయన భూములు పేదలు ఆక్రమించుకున్నారని తెలిపారు. కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం పేదల భూములు ఆక్రమించుకున్నారనేలా ప్రసంగించి తాను ఏం చెప్పాలని అనుకున్నారో సూటిగా స్పష్టం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌసులో ఆక్రమణలు ఉన్నాయని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో 439 ఎకరాల భూములు సంపాదించారని తెలిపారు. ఉద్యమాలు చేసిన వారు ఆస్తులు పోగొట్టుకుంటారని కానీ, తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ మాత్రం వందల ఎకరాలు సంపాదించారని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ మాదిరిగానే కల్వకుంట్ల కవిత పేరున 37 ఎకరాలు, హరీశ్ రావు కుటుంబానికి 30 ఎకరాలు, జోగినపల్లి సంతోష్ రావు 79, నవీన్ రావు 52, కొండలరావు 48 ఎకరాలు పోగేసినట్లు సీఎం ఆరోపించారు.

22ఎ సమస్యపై పెద్ద ఎత్తున కథనాలు రావడంతో తాను ప్రత్యేక దృష్టి సారించానని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయంలో రాస్తే రామయణం అవుతుందని, చెబితే భాగవతం అవుతుందని సీఎం చమత్కరించారు. ధరణి పేరుతో దోపిడీకి ప్లాన్ చేసిన బీఆర్ఎస్ నాయకులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కొద్దిమంది చేతికి దోచిపెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులే బ్రోకర్లుగా మారి భూ దోపిడీకి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. కానీ, భూ సమస్య తమ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్కుసూటిగా మాట్లాడతారని, అందుకే ఆయనను భూతంగా చిత్రీకరించే ప్లాన్ చేశారని మండిపడ్డారు. నిజంగా 22ఎ సమస్యతో ప్రజలు బాధపడుతున్నారని తనకు తెలుసనని, ఈ సమస్య కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.