రేవంత్ చెబుతున్న సెంటిమెంట్...ఏపీలో 2029 లో ఏమి జరుగుతుంది ?
ఇక ఏపీలో చూస్తే కనుక విభజన తరువాత తొలి ప్రభుత్వంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 లో చూస్తే వైసీపీ వచ్చింది. 2024 లో మళ్లీ టీడీపీ కూటమి అధికారం దక్కించుకుంది.
By: Satya P | 17 May 2026 9:19 AM ISTతెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక న్యూస్ పోర్టల్ నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొని అనే ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు చెప్పారు. అందులో ఆసక్తిని కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి. తాను పదేళ్ళ పాటు తెలంగాణాకు సీఎం అని రేవంత్ రెడ్డి వెరీ స్ట్రాంగ్ గా చెప్పారు. అదే సమయంలో హ్యాట్రిక్ సక్సెస్ ని కాంగ్రెస్ కొడుతుందని అన్నారు. తెలంగాణా ప్రజలను తాను నమ్ముతున్నాను కానీ ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోను అన్నారు. మొత్తానికి తెలంగాణాలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి అయితే చాలా ధీమాగా చెప్పారు. దానికి ఆయన రీజన్స్ కూడా చెప్పారు.
ఆ రికార్డుతోనే :
ఆయన ఉమ్మడి ఏపీ ఆ తరువాత విభజన తెలంగాణాలో పొలిటికల్ ట్రాక్ రికార్డుని చూసి మరీ కాంగ్రెస్ కి కనీసంగా రెండు టెర్ములు ఆ మీదట కష్టపడితే మూడు నాలుగు టెర్ములూ సాధ్యమే అని అంటున్నారు. దానికి ఆయన 1994 నుంచి ఎన్నికల్లో ప్రజా తీర్పులను ఒక స్టడీ కేసు గా తీసుకున్నారు. 1994లో ఎన్టీఆర్ ని ప్రజలు గెలిపించారు. అలా 1999 లో గెలిచి పదేళ్ళ పాటు టీడీపీ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉంది. ఆ తరువాత 2004, 2009లోనూ కాంగ్రెస్ గెలిచింది. విభజన తరువాత 2014, 2018లలో రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది 2023 లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి 2028 లో మరోసారి కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ పవర్ సెంటిమెంట్ అన్నది గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వస్తోందని ఆయన అంటున్నారు. అది తెలంగాణా వరకూ ఓకే అనుకున్నా ఏపీ సంగతి ఏమిటి అన్న చర్చ ఇపుడు సాగుతోంది.
ఏపీలో మాత్రం :
ఇక ఏపీలో చూస్తే కనుక విభజన తరువాత తొలి ప్రభుత్వంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 లో చూస్తే వైసీపీ వచ్చింది. 2024 లో మళ్లీ టీడీపీ కూటమి అధికారం దక్కించుకుంది. ఇలా విభజన ఏపీలో ట్రాక్ రికార్డు చూస్తే కనుక అయిదేళ్ళు మాత్రమే ఒక పార్టీకి అధికారం అందిస్తున్నారు ఆ టెర్మ్ పూర్తి కాగానే మరో పార్టీని తెచ్చి గద్దె మీద కూర్చోబెడుతున్నారు. ఇది ఏపీ ప్రజల రాజకీయ చైతన్యమా లేక మార్పు అన్నది తప్పనిసరి అని నిర్ణయమా అన్నది అర్ధం కావడం లేదని రాజకీయ విశ్లేషకులూ అంటున్నారు.
ఉమ్మడిగా ఉన్నపుడే :
ఇక ఉమ్మడి ఏపీలోనూ కూడా తెలంగాణా ప్రాంత ప్రజలే మరోసారి అధికార పార్టీలను కొనసాగించారు అన్నది 1999, 2009లలో సీమాంధ్ర తెలంగాణాలలో వచ్చిన సీట్లూ ఓట్లు బట్టి తెలుస్తాయని అంటున్నారు. ఆనాడు 1999లో టీడీపీ గెలిచినా సీట్లు తగ్గిపోయాయి. ఆ మేరకు సీమాంధ్రలోనే గండి పడింది. 2009 లోనూ కూడా వైఎస్సార్ కి తెలంగాణాలోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఏపీలో అయితే 18 సీట్లు ప్రజారాజ్యం సొంతం చేసుకుంది. టీడీపీ కూడా 90 కి పైగా సీట్లు సాధిస్తే అందులో ఎక్కువ సీమాంధ్రలోనే ఉన్నాయని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే కనుక రెండు టెర్ములను కొనసాగించే ట్రాక్ రికార్డు తెలంగాణా వాసులకే ఉంది తప్ప సీమాంధ్రా ప్రజలకు లేదని విశ్లేషణలు ఉన్నాయి. మరి 2029 కాదు ఏకంగా పదిహేనేళ్ళ పాటు అధికారం మాదే అని కూటమి పెద్దలు చెబుతున్నారు. అయితే రాజకీయాలు అంటేనే ఒక్కలా ఉండవు. మారుతూ ఉంటాయి. తమిళనాడులో 2011, 2016లో కూడా జయలలిత వరసగా గెలిచారు. అందువల్ల ఏపీలో కూడా యాంటీ సెంటిమెంట్ ని దాటి కూటమి మరోసారి గెలుస్తుందని అధికార పక్షం అంటూంటే ట్రాక్ రికార్డు తో పాటు అన్నీ తమకే అనుకూలం అని వైసీపీ బలంగా నమ్ముతోంది. మరి రేవంత్ రెడ్డి చెప్పిన సెంటిమెంట్ నిజం అయితే ఏపీలో రాజకీయ సమీకరణలు ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
