రేవంత్@పదేళ్ల సీఎం.. ఇదే జరగనుందా?
‘ఆశ’ ఒక్కటే సరిపోదు. దానికి ‘ఆశయం’ తోడు కావాలి. అందుకు తగ్గట్లుగా అదే పనిగా ప్రయత్నిస్తూ ఉండాలి. వీటితో పాటు కాలం కలిసి రావాలి.
By: Garuda Media | 16 Sept 2025 3:00 PM IST‘ఆశ’ ఒక్కటే సరిపోదు. దానికి ‘ఆశయం’ తోడు కావాలి. అందుకు తగ్గట్లుగా అదే పనిగా ప్రయత్నిస్తూ ఉండాలి. వీటితో పాటు కాలం కలిసి రావాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఆశ నెరవేరుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారీ పదేళ్ల ముఖ్యమంత్రి కలను ఆవిష్కరిస్తూనే వచ్చారు. మిగిలిన వారికి భిన్నంగా ఆయన పదేళ్లపాటు మాత్రమే మాట్లాడటం చూసినప్పుడు లక్ష్యాన్నివాస్తవరూపంలో చూసిన కోణం కనిపిస్తుంది. మాంచి స్వింగ్ లో ఉన్న ప్రతి ఒక్క అగ్రనేత.. తాము అధికారంలో పాతికేళ్లు.. ఇరవైఏళ్లు ఇలా చెప్పుకునేళ్లే కానీ.. పదేళ్లు మాత్రమే అని చెప్పినోళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఆ కోవలోకే చెందుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
భారీ పోటీ.. అంతకు మించిన ప్రతికూలతల నడుమ ముఖ్యమంత్రి కుర్చీని సొంతం చేసుకున్న తర్వాత కూడా రేవంత్ కు సవాళ్లు ఎదురుకావటం తగ్గలేదు. రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్షంలోనే కాదు స్వపక్షంలో ఉన్నప్పటికి దడవకుండా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా ఎజెండాను అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారు. తన మీదా.. తన ప్రభుత్వం మీదా జరిగే ప్రచారాల్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు.
ఒక్కొక్క అవాంతరాల్ని అధిగమిస్తూ.. పదేళ్ల ముఖ్యమంత్రిగా వ్యవహరించేందుకు అవసరమైన గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారు రేవంత్. మొన్నటివరకు పదేళ్ల ముఖ్యమంత్రి అన్నమాటను ప్రత్యర్థుల సంగతి తర్వాత.. సొంత పార్టీలోనూ తమ నవ్వులతో సమాధానం ఇచ్చిన పరిస్థితి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోయారు సీఎం రేవంత్. కొన్ని సమయాల్లో మార్పునకు కాలానికి మించిన దివ్య ఔషధం ఉండదు. ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజమని నిరూపించారు.
పార్టీలో తన పట్ల విముఖత ఉన్నోళ్లు.. తనను అంతర్గతంగా వ్యతిరేకించే వారిలో ఒక్కొక్కరిని దారిలోకి తెచ్చుకోవటంలో రేవంత్ విజయం సాధించారనే చెప్పాలి. మంత్రులకు తగిన స్వేచ్ఛను ఇవ్వటం.. ఎవరికి వారిని వారి శాఖల్ని స్వతంత్ర్యంగా నిర్వహించుకునే అవకాశంతో పాటు.. మరీ అవసరమైతే తప్పించి వేలు పెట్టకుండా తీసుకున్న జాగ్రత్తలు రేవంత్ కు కలిసి వచ్చేలా చేశాయని చెప్పాలి.
రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల నేపథ్యంలో ఉన్నత విద్య కాలేజీలకు నిరవధిక బంద్ ను ప్రకటించిన సంస్థల్ని సోమవారం రాత్రి నాటికి బంద్ నుంచి వెనక్కి తగ్గేలా చేశారు. వారికి ఇవ్వాల్సిన రూ.1200కోట్లలో రూ.600 కోట్లు వారంలో.. మరో రూ.600కోట్లు దీపావళి నాటికి తీర్చేసే ఫార్ములాకు కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోవటంతో బంద్ విజయవంతంగా ముగిసింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ముగిసిన ఈ వ్యవహారంలో రేవంత్ కు వ్యతిరేకంగా వ్యవహరించేవారు లేకపోలేదు.
కళాశాలల బంద్ ఎపిసోడ్ ను చూస్తే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు శ్రీధర్ బాబు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా తాను సీన్లోకి రాకుండా ఇష్యూను క్లోజ్ చేసేయటం కనిపిస్తుంది. నిజానికి ఇంతటి స్వేచ్ఛను ఏ ముఖ్యమంత్రి మంత్రులకు ఇవ్వరు. ఆ విషయాన్ని మంత్రివర్గ సహచరులు కూడా అర్థం చేసుకుంటున్న పరిస్థితి. తమలో తాము కొట్టుకొని చేతిలోని అధికారాన్ని చిందరవందర చేసుకునే కన్నా.. సీఎంకు తమ పూర్తి మద్దతు ఇస్తే సరిపోతుందన్న లెక్కకు పలువురు మంత్రులు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ఎదురయ్యే సవాళ్లను.. చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ.. ప్రతి సందర్భంలోనూ కొందరిని తనకు సానుకూలంగా ఉండేలా మార్చుకుంటున్న రేవంత్ తీరు చూస్తే.. ఆయన కంటున్న పదేళ్లు ముఖ్యమంత్రి పదవికి అవసరమైన గ్రౌండ్ ను బలంగా నిర్మించుకుంటున్నట్లు చెప్పాలి.
ఓవైపు ప్రత్యర్థుల్ని నియంత్రిస్తూ.. మరోవైపు కేంద్రంతో కావాల్సిన పనుల్ని వెంటబడి చేయించుకుంటూనే. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ లైన్ కు తగ్గట్లు కేంద్రంలోని పెద్ద తలకాయలపై మాటల దాడి చేయటం.. ఇన్ని చేస్తూనే పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నడుస్తూ.. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న వైనం చూస్తే.. రేవంత్ షురూచేసిన పదేళ్ల సీఎం ఆపరేషన్ సక్సెస్ అయ్యేందుకుర అన్ని అవకాశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఎవరిని వదలకుండా.. ఎవరికి దూరం కాకుండా అందరికి అందుబాటులోఉంటూ.. తన ఎజెండా ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఇదంతా చూస్తే..తెలంగాణ ముఖ్యమంత్రి పదవి పక్కన రేవంత్ పేరు అంచనాలకు మించిన కాలం కొనసాగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
