జూబ్లీ ఉపపోరులో ఓటమిని కేటీఆర్ ఒప్పుకున్నారా?
బాధ్యత తీసుకోవటం అందరూ చేసేదే. తీసుకున్న బాధ్యతను చివరి వరకు నిర్వర్తించటం.. తుదికంటా పోరాడటం లాంటివి తప్పనిసరి.
By: Garuda Media | 12 Nov 2025 10:07 AM ISTబాధ్యత తీసుకోవటం అందరూ చేసేదే. తీసుకున్న బాధ్యతను చివరి వరకు నిర్వర్తించటం.. తుదికంటా పోరాడటం లాంటివి తప్పనిసరి. ఆట ఏదైనా గెలుపు ఓటములు సహజం. అలానే రాజకీయాల్లో ఎన్నికలు అనివార్యం. గెలుపు కోసం అందరూ తలపడినా.. విజేతగా మిగిలేది ఒక్కరే. అలా అని.. మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేయటం ఏ మాత్రం మంచి పద్దతి కాదు. తెలంగాణ రాజకీయాల్ని మార్చేస్తుందన్న ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి.. ఉపపోరు బాధ్యతను స్వీకరించిన మాజీ మంత్రి కేటీఆర్.. తీరా పోలింగ్ వేళలో పత్తా లేకుండా పోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
జూబ్లీ ఉప ఎన్నిక బాధ్యతను కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ తీసుకుంటే.. బీఆర్ఎస్ తరఫు కేటీఆర్ బాధ్యత తీసుకున్నారు. ఎన్నికల ప్రచార వేళలో ఈ ఇరువురు అగ్రనేతలు పోటాపోటీగా వ్యవహరించారు. ఒకరికి మించి మరొకరు విమర్శనాస్త్రాల్ని సంధించుకున్నారు. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ.. బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ పత్తా లేకుండా పోయారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున.. ఆఖరి గంట వరకు ఎన్నికల ప్రచారాన్నిచేపట్టిన కేటీఆర్.. తీరా పోలింగ్ వేళ.. ఎక్కడా కనిపించలేదు.
అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారానికి చివరి రోజున మాత్రమే కాదు.. పోలింగ్ కు ముందు కూడా పార్టీ నేతలతో రివ్యూ చేయటం.. గెలుపు కోసం చేపట్టాల్సిన వ్యూహాల్ని సిద్ధం చేయటం.. అందుకు తగ్గట్లు పార్టీని నడిపించిన వైనం చూసినప్పుడు.. రేవంత్ లో ఉన్నదేమిటి.. కేటీఆర్ లో లేనిది ఏమిటన్నది అందరికి తెలిసేలా చేసింది. ఉప పోరులో గెలుపు కోసం చివరి వరకు విడిచి పెట్టకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తే.. అందుకు భిన్నంగా కేటీఆర్ మాత్రం పోలింగ్ వేళ కనిపించకుండా పోయారు. ఇదంతా చూసిన పలువురు.. జూబ్లీ ఉపపోరులో ఓటమిని ఎన్నికల ఫలితం వెలువడక ముందే కేటీఆర్ ఒప్పుకున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
