Begin typing your search above and press return to search.

అయోధ్యగా భద్రాచలం...రేవంత్ భారీ సంకల్పం

దక్షిణాది రాష్ట్రాలకు అయోధ్యగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఉంటుంది. భద్రాద్రి రామున్ని అంతా కొలిచి ఎంతో ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు.

By:  Satya P   |   18 Jan 2026 8:52 PM IST
అయోధ్యగా భద్రాచలం...రేవంత్ భారీ సంకల్పం
X

దక్షిణాది రాష్ట్రాలకు అయోధ్యగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఉంటుంది. భద్రాద్రి రామున్ని అంతా కొలిచి ఎంతో ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. అలాంటి భద్రాచలాన్ని విశేషంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక భారీ సంకల్పాన్నే తీసుకున్నారు. అయోధ్యను తలపించేలా భద్రాచలంలో ఆలయ అభివృద్ధి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతమైన ఆలయంగా భద్రాచలాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మంతో రాజకీయ బంధం :

ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాతో తన రాజకీయ బంధాన్ని రేవంత్ రెడ్డి నెమరేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో తొలుతగా పర్యటించినది ఖమ్మం జిల్లాలోనే అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించి 362 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకే బియ్యం ఇస్తే తమ ప్రభుత్వంలో ఉచితంగా సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామని అన్నారు.

రేషన్ కార్డు కోసం చావాల్సిందే :

ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఎవరైనా కోరుకుంటే ఆ ఊరిలో ఒకరు చనిపోతేనే ఇచ్చేవారు అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అలా కాకుండా లక్షలాదిగా రేషన్ కార్డులను పేదలకు అందించడం ద్వారా జనరంజకమైన ఏలుబడిని అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఫైల్ మీద సంతకం చేసింది వైఎస్సార్ అని దానిని తమ ప్రభుత్వం కొనసాగించడమే కాకుండా ఏకంగా 200 యూనిట్ల దాకా ఉచితంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

పేదలకు లక్షల్లో ఇల్లు :

బీఆర్ ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ళు ఇవ్వమంటే ఇబ్బంది పెట్టారని అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా 4.5 లక్షల ఇళ్ళని పేదలకు పంపిణీ చేశామని చెప్పారు. పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇది అని ఆయన చెప్పారు. ఇక భద్రాచలం అభివృద్ధికి ఏకంగా వంద కోట్లు ఇస్తమని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. తాము మాత్రం భద్రాచలం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అందుకోసం భూసేకరణ పెద్ద ఎత్తున సాగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. భద్రాచలాన్ని రానున్న కాలంలో బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో అయోధ్యగా భద్రాచలాన్ని చెప్పుకునేలా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పుకొచ్చారు.