పగలు వదిలేసి రాత్రి వేళల్లో కీలక నిర్ణయాలేంది రేవంత్?
సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు.. ఆ మాటకు వస్తే ఎనిమిదన్నర వరకు ఎలాంటి కీలక నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు లేవు. తొమ్మిది తర్వాత నుంచి వెల్లడైన నిర్ణయాలు అందరి అటెన్షన్ తీసుకునేలా చేసిందని చెప్పాలి.
By: Garuda Media | 30 Dec 2025 1:00 PM ISTతెలంగాణ లోని రేవంత్ సర్కారులో ఒక విచిత్ర లక్షణం కనిపిస్తుంటుంది. ప్రభుత్వ పరంగా తీసుకునే అత్యంత కీలక నిర్ణయాలు.. వాటికి సంబంధించి సమాచారం రాత్రి వేళ.. అది లేట్ నైట్ వెలువటం ఈ మధ్యన ఎక్కువైంది. ఆ మాట కంటే కూడా అదో అలవాటుగా మారిందని చెప్పటం సబబుగా ఉంటుందని చెప్పాలి. సాధారణంగా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు పగలుపూటే ప్రకటిస్తుంటారు. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారు మాత్రం రాత్రి వేళలో.. వరుస పెట్టి ప్రకటిస్తున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డిసెంబరు 29 (సోమవారం) సంగతే తీసుకుంటే.. కేవలం రెండు గంటల వ్యవధిలో ఆ మాటకు వస్తే గంటన్నర వ్యవధిలో వెలువరించిన నిర్ణయాల్ని చూస్తే.. ఇంతటి కీలక నిర్ణయాల్ని ఇలా రాత్రి వేళలో ప్రకటించటమా? అన్న భావన కలుగక మానదు. ఒకట్రెండు అయితే ఫర్లేదు. ఏకంగా ఐదారు కీలక నిర్ణయాల్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున బ్యాక్ టు బ్యాక్ వెల్లడించిన వైనం చూసినప్పుడు.. రేవంత్ సర్కారు నైట్ వేళ ఉన్నంత యాక్టివ్ గా పగలు కూడా ఉంటే ఎంత బాగుండన్న భావన కలుగక మానదు.
సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు.. ఆ మాటకు వస్తే ఎనిమిదన్నర వరకు ఎలాంటి కీలక నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు లేవు. తొమ్మిది తర్వాత నుంచి వెల్లడైన నిర్ణయాలు అందరి అటెన్షన్ తీసుకునేలా చేసిందని చెప్పాలి. కీలకమైన పాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ అంశం ఒకటి. దీనికి మించి ఇప్పటివరకు హైదరాబాద్ మహానగర పరిధిలో మూడు పోలీస్ కమిషనరేట్ లు ఉండేవి. అది కాస్తా.. ఇప్పుడు నాలుగోది చేరింది. సీఎం రేవంత్ కలల పంటగా చెప్పే ప్యూచర్ సిటీకి సంబంధించి.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.
అంతేకాదు.. ఇప్పటి వరకు రాచకొండ సీపీగా వ్యవహరించిన సుధీర్ బాబు ఫ్యూచర్ సిటీ సీపీగా నియమితులైతే.. ఇంతకాలం సైబరాబాద్ సీపీగా ఉన్న అవినాశ్ మహంతి.. రాచకొండ ను పునర్ వ్యవస్థీకరించి దానికి మల్కాజ్ గిరి కమిషనరేట్ గా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సీపీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ సీపీగా సజ్జన్నార్ ను కొనసాగిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ కు సీపీగా డాక్టర్ రమేశ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీపీగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటి వరకు ఉన్న రాచకొండగా ఉన్న కమిషనరేట్ ప్రాంతంలోని కొంత భాగంలో ఉన్న యాదాద్రి భువనగిరి ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేయటమే కాదు.. ఆ జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీని కేటాయింనున్నారు. ఇలా ఐపీఎస్ బదిలీలతో పాటు.. కీలక కమిషనరేట్ పరిధికి సంబంధించిన కీలక ప్రకటనను జారీ చేసింది.
మరో వైపు.. జెడ్పీటీసీలు.. ఎంపీటీసీల ఎన్నికలకు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అందరూ ఆశిస్తుంటే.. అందుకు భిన్నంగా హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రకటనను జారీ చేసింది. నేటి నుంచి (మంగళవారం) వార్డుల విభజన ఏర్పాటుచేస్తామని..జనవరి 10 నాటికి ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇలా పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు బాగా పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం.
