రేవంత్ రెడ్డి మీద ప్రచారంలో నిజమెంత ?
ఈ మాట చాలా కాలంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిని తప్పించేస్తారు అని ఎప్పటికపుడు ప్రచారం రావడం దానికి ప్రత్యర్ధి వర్గాలు గట్టిగా వైరల్ చేయడం జరుగుతూనే ఉంది.
By: Satya P | 23 Oct 2025 9:06 AM ISTడైనమిక్ లీడర్ గా రేవంత్ రెడ్డిని చెప్పుకోవాలి. తెలంగాణాలో ఆయన దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో పెనవేసుకుని పోయారు. ఆయనకు అతి పెద్ద ఆకర్షణ ఏమిటి అంటే ఆయన వాగ్దాటి. ఆయన తడుముకోకుండా గంటల తరబడి మాట్లాడగలరు, ఆ మాటలలో కూడా ఆకట్టుకునేలా చేయడమే గొప్పతనం. అంతే కాదు వేలాది జనాలను అలా కూర్చోబెట్టేయగలరు. అందుకే ఆయన సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీసీసీ చీఫ్ గా సీఎం గా రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సాధించారు అంటే ఆయన నాయకత్వమే అని చెప్పాల్సి ఉంటుంది.
తప్పిస్తారంటూ :
ఈ మాట చాలా కాలంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిని తప్పించేస్తారు అని ఎప్పటికపుడు ప్రచారం రావడం దానికి ప్రత్యర్ధి వర్గాలు గట్టిగా వైరల్ చేయడం జరుగుతూనే ఉంది. అయితే ఆ పని జరగనూ లేదు, రేవంత్ రెడ్డి ప్రాధాన్యత తగ్గనూ లేదు అని ఆయన వర్గం అంటోంది. రేవంత్ రెడ్డి రెండేళ్ళ సీఎం గా తన సమర్ధతతో పనిచేస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.
పెద్దాయన అలా అన్నారా :
ఈ మధ్య ఒక ప్రచారం అయితే తెర మీదకు వచ్చింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వద్దకు కొందరు తెలంగాణా కాంగ్రెస్ నేతలు వెళ్ళినపుడు ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పాలన మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అని ప్రచారంగా సాగుతోంది. మరోసారి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని పెద్దాయన అన్నట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు నిజంగా అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సరిగ్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేళ దీనిని తెర మీదకు తీసుకుని రావడం మీదనే చర్చ సాగుతోంది.
హైకమాండ్ చేతుల్లోనే :
కాంగ్రెస్ హైకమాండ్ అంటే సుప్రీం. తలచుకుంటే ఎంతటి వారిని అయినా తప్పించేయగలదు. కానీ అలా చేయడం లేదు అంటే అందులోనే మ్యాటర్ మొత్తం ఉందని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ జమానా వచ్చాక అయిదేళ్ళ పాటు సీం గా అవకాశం ఇవ్వడం కూడా ఒక విధానంగా పెట్టుకున్నారు అని అంటున్నారు. ఎంతటి నాయకుడు అయినా స్వల్పకాలంలో అద్భుతాలు సృష్టించలేరని అక్కడికి రేవంత్ రెడ్డి ఉన్నంతలో బెటర్ గానే పాలన ఇస్తున్నారని ఆయన వర్గం అంటోంది. అయితే ఆయనను తప్పించేస్తారు అని జరుగుతున్న ప్రచారంలో హైకమాండ్ ఏమీ వెనక లేదని అంటున్నారు. హైకమాండ్ ఈ తరహా ప్రచారాలను ప్రోత్సహించదని కూడా కాంగ్రెస్ కల్చర్ తెలిసిన వారు చెబుతున్నారు
ఆప్షన్ లేదా :
ఇక రేవంత్ రెడ్డిని తప్పించాలని నిజంగా అనుకుంటే కాంగ్రెస్ పెద్ద సాహసమే చేసినట్లుగా కూడా చెబుతున్న వారు ఉన్నారు. కేసీఆర్ అవతల ప్రత్యర్థిగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆయనను ఓడించి పక్కన పెట్టారు అంటే జనాలు రేవంత్ రెడ్డి మీద నమ్మకంతోనే అని అంటున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కి ధీటుగా జనంలో నిలిచి గెలిచిన నాయకుడు అని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ని 2014 లో మెచ్చిన జనాలు 2018లో మాత్రం ప్రతిపక్షం వీక్ గా ఉండడం వల్లనే రెండోసారి నెగ్గించారని అంటున్నారు. 2023 నాటికి రేవంత్ రూపంలో ఆల్టర్నేషన్ లీడర్ షిప్ ని చూసి చాన్స్ ఇచ్చారని చెబుతున్నారు ఒకవేళ రేవంత్ ని తప్పించాలని అనుకుంటే వేరే ఆప్షన్ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. సో రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారంగానే ఇది కొట్టి పారేస్తున్నారు. చూడాలి మరి తెలంగాణా కాంగ్రెస్ పాలిటిక్స్ ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో.
