సైబర్ నేరగాళ్లకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన రిటైర్డు మహిళా అధికారిణి
హైదరాబాద్ కు చెందిన ఈ పెద్ద వయస్కురాలైన మహిళా అధికారిణి ఉదంతం పోలీసు విభాగంలో కొత్త చర్చకు తెర తీసింది.
By: Garuda Media | 17 Sept 2025 11:08 AM ISTసైబర్ నేరస్తుల ఆరాచకం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రోజుకో కొత్తతరహా మోసంతో అందినకాడికి దోచుకుంటున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో సైబర్ మోసాలపై ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున అవగాహన కార్యాక్రమాల్ని చేపట్టి.. ఆ నేరాలకు చెక్ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. అవేమీ ఫలవంతం కావట్లేదు. అత్యాశ.. భయం అనే ఆయుధాల్ని వాడుతున్న సైబర్ నేరగాళ్ల బారిన పడిన ఒక రిటైర్డు మహిళా అధికారి తాజాగా ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం వెలుగు చూసింది.
హైదరాబాద్ కు చెందిన ఈ పెద్ద వయస్కురాలైన మహిళా అధికారిణి ఉదంతం పోలీసు విభాగంలో కొత్త చర్చకు తెర తీసింది. డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను భయపెట్టిన సైబర్ నేరస్తులు 76 ఏళ్ల ఆమె నుంచి భారీగా డబ్బును దోచుకోవటమే కాదు.. ఆ భయాందోళనలతో గుండెపోటుకు గురై మరణించారు. బెంగళూరు పోలీస్ లోగోతో బాధితురాలికి వరుస పెట్టి కాల్స్ చేసిన సైబర్ నేరస్తులు.. ఫేక్ ఐడీ.. ఫేక్ కోర్టు స్టాంప్ తో ఉన్న డాక్యుమెంట్లను చూపించి ఆమెను మాసికంగా వేధింపులకు గురి చేశారు.
హ్యుమన్ ట్రాఫికింగ్ లో ఆమె పాత్ర ఉందని.. ఆమెపై కేసు నమోదైనట్లుగా పేర్కొన్న దుండగులు.. ఆమెను తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. ఆమె నుంచి రూ.6.6లక్షల పెన్షన్ డబ్బుల్ని దోచేసిన వారు.. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేశారు. దీంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ రిటైర్డు మహిళా అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఫోన్లు.. మెసేజ్ లు చేయటంతో ఆమె కొడుకు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
