తెలంగాణ ప్రాజెక్టులు.. ఏబీవీ హాట్ కామెంట్స్
కడపలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏబీవీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 11 Nov 2025 3:46 PM ISTరిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తన వాయిస్ మరింత పెంచారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి టార్గెట్ గా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఈ రిటైర్డ్ పోలీసు అధికారి కొన్నాళ్లుగా కూటమి ప్రభుత్వంగా కారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏబీవీ.. ఇప్పుడు తన గురిని తెలంగాణ ప్రాజెక్టులపైకి మళ్లించారు. ఏపీ రైతాంగం మేలు కోరుకుంటున్నట్లు చెబుతున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రాజెక్టులను పరిశీలిస్తూ తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న జలాశయాలపై గళం విప్పారు.
కడపలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏబీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మాణానికి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కార్ ఇటీవల తీసుకువచ్చిన జీవో -32ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించకపోవడంపై ఆయన పశ్నలు లేవనెత్తారు. ఆల్మట్టి డ్యాం ఎత్తుతో కృష్ణా నది జలాల్లో 130 టీఎంసీల నీటి ఏపీ నష్టపోతుందని ఏబీవీ ఆవేదన వ్యక్తం చేశారు. నదీ జలాల ట్రిబ్యునల్ చట్టానికి విరుద్ధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతోందని ఆందోళన వెలిబుచ్చారు.
భౌగోళిక పరిస్థితుల కారణంగా రాయలసీమకు నీటి వనరులు తక్కువని ఏబీవీ వివరించారు. కొన్ని పంటలకు అనువైన ప్రాంతమని, రాయలసీమకు దీర్ఘకాలికంగా వేధిస్తున్న నీటి సమస్య పరిష్కారానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని కోరారు. పార్టీలు ఓట్ల కోసం కాదని రైతుల బాగోగుల కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో కాదని, బాధ్యతతో మెలగాలని సూచించారు. 35 ఏళ్ల క్రితం ట్రైనీ ఐపీఎస్ గా తాను కడపలో పనిచేశానని గుర్తు చేశారు. నాటికి, నేటికి వ్యవసాయంలో పెద్దగా మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ కోసం శివరామకృష్ణ మంచి ప్రాజెక్టులు డిజైన్ చేశారని ప్రశంసించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు రాయలసీమ రూపురేఖలు మార్చే ప్రాజెక్టు అని నొక్కి చెప్పారు. 2004లో జలయజ్ఞం పేరుతో రాయలసీమ ప్రాజెక్టులకు కదలిక వచ్చిందని ఏబీవీ వివరించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టులను వదిలేశాయని విమర్శించారు. ఇదేసమయంలో బనకచర్లపై ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులు ఏపీకి గుదిబండగా మారుతాయని’’ ఏబీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టమని తెలంగాణ నేతలు చెబుతున్నారని, అసలు ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ కన్నా ఏపీకే ఎక్కువ నష్టమంటూ ఏబీవీ ఆరోపించారు.
కడప జిల్లా ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా పంట కాలువలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నట్లు ఏబీవీ వివరించారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు ఫారెస్టు అనుమతులతో ఆలస్యం అంటూ సాకులు చెబుతున్నారు. ఫారెస్టు అనుమతుల కోసం రూ.25 కోట్లు ఖర్చుచేయలేకపోతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఎవరూ పోరాటం చేసినా నేను ముందుంటా, నీళ్లు రాని ప్రాజెక్టులకు ఎన్ని సార్లు శంకుస్థాపనలు చేస్తారని ఏబీవీ ప్రశ్నించారు. ఎన్నిసార్లు జలహారతలు ఇస్తారు, సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వింతగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
