రాజకీయాల్లోకి సీనియర్ ఐపీఎస్..?! చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తహతహ
ఏపీ రాజకీయాల్లో బ్యూరోక్రాట్ల పాత్ర చర్చనీయాంశం అవుతోంది. ఉద్యోగాలలో ఉన్నప్పుడు రాజకీయ నేతలతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అఖిలభారత సర్వీసు అధికారులు, విశ్రాంత జీవితంలో రాజకీయంగా తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు.
By: Tupaki Political Desk | 4 Aug 2026 10:00 PM ISTఏపీ రాజకీయాల్లో బ్యూరోక్రాట్ల పాత్ర చర్చనీయాంశం అవుతోంది. ఉద్యోగాలలో ఉన్నప్పుడు రాజకీయ నేతలతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అఖిలభారత సర్వీసు అధికారులు, విశ్రాంత జీవితంలో రాజకీయంగా తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేశారు. కొందరు విజయం సాధించి చట్టసభలలో అడుగు పెడితే మరికొందరు పరాజయంతో మళ్లీమళ్లీ తమ అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఇక లేటెస్ట్ గా రిటైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుండగా, ఈ నెలలో రిటైర్ కాబోయే మరో సీనియర్ అధికారి కూడా రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇలాంటి వారిలో పనిష్మెంట్ అనుభవిస్తూనే రిటైర్ అవుతున్నారు. సర్వీసు ముగిసిన సమయంలో కూడా ప్రభుత్వం తమపై కరుణ చూపడం లేదని ఆవేదనతో ఈ అధికారులు రగిలిపోతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తమను అవమానకరంగా సర్వీసు నుంచి సాగనంపుతున్న ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నారని అంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు అధికారులు విపక్షం వైసీపీతో చేతులు కలినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు ఇప్పటికే రిటైర్ కాగా, మరొకరు కొద్దిరోజుల్లో రిటైర్ కానున్నారని అంటున్నారు.
ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఆ అధికారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతోనే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని అంటున్నారు. కొద్దిరోజుల్లో సర్వీసు ముగుస్తుండటం వల్ల తనకు చేతనైన విధంగా ప్రభుత్వంపై పోరు సాగించాలని ఆ సీనియర్ అధికారి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. లేనిపోని కేసులు బనాయించి తనను జైలులో పెట్టడమే కాకుండా, 30 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆ అధికారి ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలను దెబ్బతీసేలా పావులు కదిపేందుకు ఆ అధికారి రంగంలోకి దిగారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాడేపల్లిలో ఓ ప్లాటు అద్దెకు తీసుకున్న సీనియర్ అధికారి, రాజకీయాల్లోకి వచ్చాక ఏం చేయాలి? ఎలా చేయాలి? ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే వ్యూహాలు ఏంటి? అన్న దిశగా చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న సదరు అధికారి నేరుగా విపక్షం వైసీపీలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలా? లేక తటస్థంగా ఉంటూ ప్రభుత్వ విధాన నిర్ణయాలపై గళం విప్పాలా? అనే విషయమై తర్జనభర్జనకు లోనవుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై తన అంతరంగాన్ని వైసీపీ అధిష్టానానికి తెలియజేశారని, అయితే పార్టీ పెద్దలు మాత్రం ఏ విషయంపై క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు. ఆ అధికారి విషయంలో పార్టీకి ఆసక్తి ఉన్నప్పటికీ, ఆయనను వినియోగించుకునే విషయంలో రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఏ విధంగా వ్యవహరిస్తే లాభం ఉంటుంది? నేరుగా పార్టీలో చేర్చుకోవడం ద్వారా లాభం ఉంటుందా? లేక తటస్థ వేదికపై నుంచి పోరాటానికి సాయం చేయడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందా? అనే విషయాలపై వైసీపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి సెప్టెంబరు నుంచి రాష్ట్ర రాజకీయాలలో వైసీపీ తరపున మరో గళం బలంగా వినిపించే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
