కొత్త ఏడాదిలోపు మరో గుడ్ న్యూస్.. తగ్గనున్న ఈఎంఐ భారం
కొత్త ఏడాది కంటే ముందే.. ఈ గుడ్ న్యూస్ వస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరులో జరిగే ద్రవ్యపరపతి విధాన కమిటీలో రెపోరేటును మరింత తగ్గించే వీలుందని చెబుతున్నారు.
By: Garuda Media | 25 Nov 2025 11:30 AM ISTసామాన్య.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతిని ఇబ్బందికి గురి చేసే అంశం ఏమైనా ఉందంటే.. అది ఈఎంఐలతోనే. సొంతింటి కలను నెరవేర్చుకోవటానికి వీలుగా బ్యాంక్ లో లోన్ తీసుకొని ఇంటిని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఈ రుణభారాన్ని ఏళ్లకు ఏళ్లుగా మోయటం మామూలే. అయితే.. రెపోరేటు తగ్గించు సందర్భాల్లో ఈ భారం కాసింత తగ్గి.. ఈఎంఐదారులకు కొంత ఊరటను కలిగిస్తూ ఉంటుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే ఉన్న వడ్డీరేట్లకు మరింత కోత పెట్టేందుకు వీలుగా సంకేతాలు వెలువడ్డాయి.
కొత్త ఏడాది కంటే ముందే.. ఈ గుడ్ న్యూస్ వస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరులో జరిగే ద్రవ్యపరపతి విధాన కమిటీలో రెపోరేటును మరింత తగ్గించే వీలుందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఆర్ బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రెపో రేటును మరింత తగ్గించేందుకు అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాడి ప్రారంభంలో కీలక రెపో రేటును 100 బేసిక్ పాయింట్లు తగ్గించటం.. ఆగస్టు నుంచి దానని స్థిరంగా కొనసాగించటం తెలిసిందే.
డిసెంబరులో జరిగే ద్రవ్య పరపతి సమావేశంలోకీలక రెపో రేటు తగ్గటం ఖాయమని.. దీంతో హోం లోన్ మీద ఉండే ఈఎంఐ భారం కొంత మేర తగ్గుతుందని చెబుతున్నారు ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతం ఉండగా.. డిసెంబరులో మరో 25 బేసిక్ పాయింట్లు తగ్గే వీలుందని.. దీంతో 5.25 శాతానికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఇంతకు మించిన స్వీట్ న్యూస్ మధ్యతరగతి జీవికి ఇంకేం ఉంటుంది చెప్పండి?
