వైసీపీ కొత్త ఇంచార్జిలు.. చిలకలూరిపేట నుంచి మళ్లీ రజినీకి స్థానచలనం!
ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని వైసీపీకి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ ఫిర్యాదు చేయడం ఇటీవల పెను సంచలనంగా మారింది.
By: Tupaki Political Desk | 11 Nov 2025 1:00 AM ISTవైసీపీ నియోజకవర్గ ఇంచార్జిలు మళ్లీ మారే అవకాశం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో ఆమె సమన్వయకర్తగా ఉన్న ఎమ్మిగనూరుకు మరో నేతను నియమించారు. అదేవిధంగా మరిన్ని నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించే విషయమై అధినేత జగన్ కసరత్తు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రి విడదల రజినిని అక్కడి నుంచి రేపల్లెకు పంపాలనే ప్రతిపాదనను జగన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
మాజీ మంత్రి విడదల రజిని గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన రజిని 2022లో మంత్రి అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉందన్న కారణంతో రజినిని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు. అయితే వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ ప్రయోగం వల్ల ఎటువంటి ఉపయోగం దక్కలేదు. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రజిని భారీ తేడాతో ఓటమి చూశారు. అయితే ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే రజినినీ మళ్లీ చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమిస్తూ వైసీపీ అధినేత ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ నియామకం వల్ల చిలకూరిపేటలో రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో తప్పించిన రజినీని మళ్లీ చిలకూరిపేట తీసుకురావడంతో అలక వహించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజనామా చేయగా, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తలపడిన కావటి మనోహర్ నాయుడు కూడా ఇదే కారణంతో పార్టీకి బైబై చెప్పేశారని అంటున్నారు. ఇదే సమయంలో చిలకలూరిపేటలో మాజీ మంత్రి రజినిపై కేడర్ అసంతృప్తి ఎక్కువగా ఉందని ఇటీవల కొన్ని పరిణామాలతో పార్టీ అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని వైసీపీకి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ ఫిర్యాదు చేయడం ఇటీవల పెను సంచలనంగా మారింది. అదే విధంగా పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వంలో ఎదురవుతున్న వేధింపుల విషయమై ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు విడదల రజినీపై రావడం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రజినీని చిలకలూరిపేటలో కొనసాగించడం వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి వచ్చిన అధినేత జగన్.. మాజీ మంత్రి రజినీని చిలకలూరిపేట నుంచి రేపల్లి నియోజకవర్గానికి మార్చాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రేపల్లి ఇంచార్జిగా ఈవూరి గణేష్ వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గణేష్ అందరిలానే ఓటమి చవిచూశారు. సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను కాదని గణేష్ కు టికెట్ ఇస్తే, ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని జగన్ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో రజినీని రేపల్లెకు మార్చి చిలకలూరిపేటకు కొత్తవారిని తీసుకోవాలని అధినేత జగన్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పొన్నూరులో కూడా ప్రస్తుతం సరైన ఇంచార్జి లేరన్న వాదన వినిపిస్తోంది. దీంతో రజినీని అటు మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదని అంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి విడదల రజినీకి చిలకలూరిపేట నుంచి తప్పించడం ఖాయమన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది.
