Begin typing your search above and press return to search.

అమ్మాయిలూ.. ‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ కోసం చూస్తున్నారా?

ఒంటరితనంతో బోర్ కొడుతోందా.. షాపింగ్‌కి కవర్లు మోసేందుకు లేదా మీ డిజైనర్ డ్రెస్‌కి కాంప్లిమెంట్స్ ఇచ్చేందుకు ఓ అందమైన కుర్రాడు కావాలా? అదిగో సోషల్ మీడియాలో ఆగస్టు 1 స్పెషల్ ఆఫర్ నడుస్తోంది.

By:  A.N.Kumar   |   8 Aug 2026 11:28 PM IST
అమ్మాయిలూ.. ‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ కోసం చూస్తున్నారా?
X

ఒంటరితనంతో బోర్ కొడుతోందా.. షాపింగ్‌కి కవర్లు మోసేందుకు లేదా మీ డిజైనర్ డ్రెస్‌కి కాంప్లిమెంట్స్ ఇచ్చేందుకు ఓ అందమైన కుర్రాడు కావాలా? అదిగో సోషల్ మీడియాలో ఆగస్టు 1 స్పెషల్ ఆఫర్ నడుస్తోంది. రెంట్ బాయ్‌ఫ్రెండ్‌పై ఏకంగా 50% డిస్కౌంట్ ఇస్తున్నారంట.. నిజంగా ఎంత వినసొంపైన ఆఫర్ కదూ.. స్విగ్గీ, జొమాటోల్లో ఫుడ్ ఆర్డర్ చేసినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తూ ‘బాయ్‌ఫ్రెండ్’ని కూడా గంటల చొప్పున ఆర్డర్ ఇచ్చేయొచ్చన్నమాట. కాఫీ మీటింగ్, మూవీ డేట్, షాపింగ్ కంపెనీ అని రకరకాల ప్యాకేజీలు ప్రకటిస్తూ దానికి తగ్గట్టు రకరకాల కుర్రాళ్ల ఫోటోలను డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టర్లలో వాళ్లు చూపిస్తున్న క్రియేటివిటీ చూస్తే ఎవరికైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

అయితే ఆగండి మేడమ్స్ ఈ వర్చువల్ ఫాంటసీకి కాస్త బ్రేకులు వేయండి. అక్కడ కనిపిస్తున్నవన్నీ 'రీల్' ఫోటోలే తప్ప 'రియల్' క్యారెక్టర్లు కావు. ఈ డిస్కౌంట్ల వెనుక ఎంత పెద్ద డ్రామా ఉందో తెలిస్తే మీ ఫ్యూజ్ అవుట్ అవ్వడం ఖాయం. మోజు పడి ఏ ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ అకౌంట్‌కో డీఎమ్ చేశారంటే అసలు కథ మొదలవుతుంది. మొదట రామ్ చరణ్, మహేష్ బాబుల మిక్సింగ్‌లా ఉండే ఫేక్ ఫోటోలు చూపిస్తూ చాలా స్వీట్‌గా మాట్లాడతారు. ఆ తర్వాత కుర్రాడు బైక్ వేసుకుని బయలుదేరాడని ముందుగా బుకింగ్ కన్ఫర్మేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేమెంట్ పేర్లతో క్యూఆర్ కోడ్లు పంపుతారు. మీరు అమాయకంగా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, డబ్బులు పంపేశాక బాయ్‌ఫ్రెండ్ ఎక్కడ అని అడిగేలోపే మీ ప్రొఫైల్ బ్లాక్ అయిపోతుంది.

డబ్బులు పోతే పోయాయిలే అని సరిపెట్టుకుందామన్నా ఈ కేటుగాళ్లు అంతటితో వదలేరండోయ్. చాటింగ్ స్పీడ్‌లో మీరు షేర్ చేసిన ఫోన్ నెంబర్లు, పర్సనల్ ఫోటోలు పట్టుకుని బ్లాక్‌మెయిలింగ్ స్టార్ట్ చేస్తారు. అలాగే అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడం వల్ల భౌతిక భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందిస్తూ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ఆఫర్‌ను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, రూపాయి కూడా ముందస్తుగా చెల్లించవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే లేదా మోసపోతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలూ ఒంటరితనం పోగొట్టుకోవడానికి సరదాగా సినిమాలు చూడండి తప్ప ఇలాంటి 'రెంట్ బాయ్‌ఫ్రెండ్' డిస్కౌంట్లకు కక్కుర్తి పడి జేబులు ఖాళీ చేసుకోకండి..