Begin typing your search above and press return to search.

సీక్రెట్ రివీల్ చేసిన మంత్రి లోకేశ్.. ఏపీకి వచ్చిన ఆ భారీ పెట్టుబడి ఇదే..

ఏపీకి భారీ పెట్టుబడి రాబోతోందని, ఆ విషయాన్ని గురువారం ఉదయం 9 గంటలకు బయట పెడతానని మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ వెనుక సస్పెన్స్ తొలగిపోయింది.

By:  Tupaki Political Desk   |   13 Nov 2025 12:18 PM IST
సీక్రెట్ రివీల్ చేసిన మంత్రి లోకేశ్.. ఏపీకి వచ్చిన ఆ భారీ పెట్టుబడి ఇదే..
X

ఏపీకి భారీ పెట్టుబడి రాబోతోందని, ఆ విషయాన్ని గురువారం ఉదయం 9 గంటలకు బయట పెడతానని మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ వెనుక సస్పెన్స్ తొలగిపోయింది. చెప్పిన టైమ్ కే మరో ట్వీట్ చేసిన మంత్రి లోకేశ్ ఏపీకి వస్తున్న భారీ పెట్టుబడి వివరాలను బయటపెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రముఖ సంస్థ రెన్యూ పవర్ మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిందని, ఆ సంస్థ మొత్తం రూ.82 వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

ఐదేళ్ల తర్వాత రెన్యూ పవర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రెన్యూ పవర్ పెట్టుబడులు పెడుతున్నట్లు లోకేశ్ ‘ఎక్స్’లో స్పష్టం చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంటులో లోకేశ్ ఏం రాశారంటే.. ‘‘రెన్యూ వపర్ రూ.82,00 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అడుగుపెడుతోంది. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీలో అడుగు పెడుతున్న రెన్యూ పవర్ పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుంది.

సోలార్ ఇంగాట్ & వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉంది’’ అంటూ మంత్రి లోకేశ్ తన ట్వీట్ లో ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే పీపీఏలను రద్దు చేసింది. దీంతో అప్పట్లో రెన్యూ ఎనర్జీ సంస్థ రాష్ట్రానికి గుడ్ బై చెప్పింది. టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందని అంటున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లడంతో రెన్యూ పవర్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు అయ్యాయి.

ఇక తాజాగా కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో భారీ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఈ పరిస్థితులలో రెన్యూ పవర్ కూడా మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో జరిగే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఈ మేరకు ఒప్పందం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.