Begin typing your search above and press return to search.

సాంకేతిక‌త‌కు సెల్యూట్‌.. గ‌యానా నుంచే గుండె ఆప‌రేష‌న్‌.. ఫ‌స్ట్‌టైమ్‌!

భార‌త్‌-గ‌యానాల మ‌ధ్య దూరం 20 వేల కిలోమీట‌ర్లు. అయితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ హృద్రోగి.. త‌న‌కు ఆప‌రేష‌న్ నిమిత్తం గ‌యానా వెళ్లాల‌ని అనుకున్నారు.

By:  Garuda Media   |   9 Jun 2026 10:10 AM IST
సాంకేతిక‌త‌కు సెల్యూట్‌.. గ‌యానా నుంచే గుండె ఆప‌రేష‌న్‌.. ఫ‌స్ట్‌టైమ్‌!
X

అన్ని రంగాల్లోనూ విస్త‌రిస్తున్న సాంకేతిక‌త‌ను స‌రైన విధానంలో వినియోగించుకుంటే అద్భుతాల‌ను సృష్టించ‌గ‌ల‌ద‌ని నిరూపి స్తోంది. .ఎక్క‌డో ఉన్న గ‌యానా దేశం నుంచి ఓ వైద్యుడు.. మ‌న దేశంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇండోర్‌లో ఓ రోగికి గుండె ఆప‌రేష‌న్ చేసి హిస్ట‌రీ క్రియేట్ చేశారు. దేశంలో ఇలా రోబోటిక్ స‌ర్జ‌రీ.. అందునా గుండెకు చేయ‌డం ఇదే తొలిసార‌ని వైద్యులు చెబుతున్నారు. సాంకేతిక‌త‌కు సెల్యూట్ చేస్తున్నారు.

ఏం జ‌రిగింది?

భార‌త్‌-గ‌యానాల మ‌ధ్య దూరం 20 వేల కిలోమీట‌ర్లు. అయితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ హృద్రోగి.. త‌న‌కు ఆప‌రేష‌న్ నిమిత్తం గ‌యానా వెళ్లాల‌ని అనుకున్నారు. అక్క‌డ భార‌త సంత‌తికి చెందిన వైద్యుడు డాక్టర్‌ సుధీర్ శ్రీవాత్సవ.. ``ఇంత దూరం రావొద్దులే`` అంటూ.. రోబోటిక్ విధానంలో గ‌యానా నుంచే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రోగికి గుండె ఆప‌రేష‌న్ చేశారు. ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్టు వైద్యులు తెలిపారు.

ఎలా చేస్తారు?

ఎక్క‌డి నుంచి ఎక్క‌డి వారికైనా శ‌స్త్ర చికిత్స‌లు చేసే విధంగా మ‌న దేశ వైద్య రంగం అభివృద్ధి చెందింది. దీనినే `ఎస్‌ఎస్‌ఐ మంత్ర` అని పిలుస్తున్నారు. ఈ విధానంలో సర్జికల్ రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. దీనికి గాను టెలి-సర్జన్ కన్స‌ల్టెన్సీని వినియోగిస్తారు. కాంపాక్ట్ చైర్-ఆధారిత రోబోటిక్ నియంత్రణ వ్యవస్థగా ఇది ప‌నిచేస్తుంది. రోబోటిక్ చేతులు, శస్త్రచికిత్స పరికరాలు సర్జన్ చేతి కదలికలను అనుకరిస్తూ శస్త్రచికిత్స నిర్వ‌హిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ‌ను త్రీడీ విజువ‌లైజేష‌న్‌లో వైద్యులు గ‌మ‌నిస్తారు. తాజాగా చేసిన చికిత్స విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని ఇండోర్ వైద్యులు తెలిపారు. దీనికి సుమారు 45 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రించారు.

ఇది రెండో సారే అయినా..

కాగా.. దేశంలో రోబోటిక్ వ్య‌వ‌స్థ ద్వారా స‌ర్జ‌రీ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌త నెల‌లో ఇదే ఇండోర్ ప్రాంతానికి చెందిన రోగికి.. ఫ్రాన్స్ కు చెందిన ఓ వైద్యుడు ఇలానే రోబోటిక్ స‌ర్జ‌రీ చేశారు. అయితే.. తాజా ఆప‌రేష‌న్ రికార్డు సృష్టించ‌డానికి కార‌ణం.. దేశాల మ‌ధ్య ఉన్న దూర‌మే. ఫ్రాన్స్‌కు-భార‌త్‌కు మ‌ధ్య దూరం 10 వేల‌కిలో మీట‌ర్లు అయితే.. గ‌యానుకు.. భార‌త్‌కు మ‌ధ్య దూరం 20 వేల కిలో మీట‌ర్లు. దీంతో అత్యంత సుదూరం నుంచి రోబోటిక్ స‌ర్జ‌రీ చేసిన ఘ‌న‌తగా ఈ ఆప‌రేష‌న్ నిలిచింది.