Begin typing your search above and press return to search.

భయంకర నరకంలో వెలిగిన వీరగాథలు: ముంబయి 26/11 దాడులకు 17 ఏళ్లు!

సముద్ర తీరాన ప్రశాంతంగా వెలిగే భారతదేశ వాణిజ్య రాజధాని ముంబయి, 2008 నవంబర్ 26న రాత్రి అనుకోని పెను విషాదాన్ని చవిచూసింది.

By:  A.N.Kumar   |   26 Nov 2025 5:55 PM IST
భయంకర నరకంలో వెలిగిన వీరగాథలు: ముంబయి 26/11 దాడులకు 17 ఏళ్లు!
X

సముద్ర తీరాన ప్రశాంతంగా వెలిగే భారతదేశ వాణిజ్య రాజధాని ముంబయి, 2008 నవంబర్ 26న రాత్రి అనుకోని పెను విషాదాన్ని చవిచూసింది. వీధుల్లో రక్తం ఏరులై పారింది... భవనాల మధ్య దుమారం చెలరేగింది... ఎటుచూసినా భయంకర దృశ్యాలు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల అమానుష దాడులకు అది ఒక దారుణమైన సాక్ష్యం. ఆ ఒక్క రోజు దేశం ఎన్నడూ చూడని విధంగా రక్తమోడింది. ఉగ్రవాదుల కాల్పుల మోతకు ప్రజలు వణికిపోయారు, కానీ అదే సమయంలో భద్రతా బలగాల తిరుగులేని ధైర్యం, సామాన్యుల లోపలి అప్రతిహత సాహసం ఆ కాళరాత్రిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి.

ఈ భయంకర దాడులకు నేటితో సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ చీకటిలో ఆశ, మానవత్వం, ధైర్యం అనే జ్యోతులను వెలిగించిన కొందరి అజ్ఞాత వీరగాథలను మరోసారి గుర్తు చేసుకుందాం.

* చీకట్లో కాంతిని తెచ్చిన అజ్ఞాత వీరులు

నవంబర్ 26, 2008 రాత్రి, ముంబయిలోని ప్రధాన ప్రాంతాలైన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST) రైల్వే స్టేషన్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ వంటి కీలక ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయి.

* హాలిడే కోసం వచ్చి... 157 మందిని కాపాడిన రవి ధరణీధర్కా

అమెరికా మెరైన్‌ కోర్‌ మాజీ కెప్టెన్‌ అయిన రవి ధరణీధర్కా తన కుటుంబంతో కలిసి హాలిడే కోసం ముంబయి వచ్చారు. ఆ రాత్రి వారు తాజ్ హోటల్‌ 20వ అంతస్తులోని రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లో ఉన్నారు. కాల్పుల శబ్దం, పేలుళ్లతో ఆ వైభవంగా సాగుతున్న సాయంత్రపు వేడుక ఒక్కసారిగా నరకయాతనగా మారింది. ఉగ్రవాదుల దాడిని గుర్తించిన వెంటనే రవి ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. అక్కడున్నవారిని రక్షించేందుకు కొంతమంది దక్షిణ కొరియా కమాండోలతో కలిసి ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సమయస్ఫూర్తి అద్భుతమైనది. మెట్ల కింద ఉన్న ఒక కాన్ఫరెన్స్ హాల్‌ను తాత్కాలిక షెల్టర్‌గా మార్చి, 157 మందిని అందులోకి పంపించారు. తలుపులకు టేబుళ్లు, కుర్చీలు అడ్డుపెట్టి, ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా ఉండేలా చేశారు. అయితే, మంటలు వ్యాపించడంతో అక్కడ ఉండడం ప్రమాదమని గ్రహించారు. వెంటనే అందరినీ మెట్లు గుండా ఎవరికీ కనిపించకుండా అత్యంత చాకచక్యంగా బయటకు తరలించారు. ఈ ప్రక్రియలో, నడవలేని స్థితిలో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలిని రవి తన భుజాలపై మోసుకెళ్లడం ఆయన ధైర్యానికి, మానవత్వానికి నిదర్శనం. ఆయన కేవలం ఒక హాలిడే కోసం వచ్చి, ఆ రోజు 157 ప్రాణాలను కాపాడిన అజ్ఞాత హీరోగా నిలిచారు.

* ఆర్మీ వచ్చేవరకు... 60 మందిని దాచిపెట్టిన మల్లిక జగద్

తాజ్ హోటల్‌లో యునిలివర్ కార్పొరేట్ ఈవెంట్‌లో మేనేజర్‌గా ఉన్న మల్లిక జగద్ రాత్రి 9.30కు కాల్పుల శబ్దాలు వినగానే పరిస్థితి తీవ్రతను తక్షణమే గ్రహించారు. వీఐపీలు టార్గెట్ అవుతున్నారన్న సమాచారం ఉన్నా, ఆమె ధైర్యం మాత్రం చెక్కుచెదరలేదు.ఆమె తెగువ చూపి హాల్‌ తాళాలు తెచ్చి అన్ని తలుపులు లాక్ చేశారు. అతిథులు ఆందోళనతో బయటకు వెళ్లాలని ప్రయత్నించినా, వారిని సర్దిచెప్పి కదలకుండా ఉంచారు. ఒకరు బయటకు వెళ్లినా ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని గమనిస్తారన్న అంచనాతో ఆమె ఎవరినీ కదలకుండా కట్టడి చేశారు. ఆర్మీ సిబ్బంది మరుసటి ఉదయం వచ్చి వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకెళ్లేంతవరకు, మల్లిక తన శాంతం, ధైర్యంతో 60 మంది ప్రాణాలను కాపాడారు. ఆమె చర్య ఒక నిజమైన నాయకత్వ లక్షణానికి ప్రతీక.

* కాల్పుల మధ్యే... పసిప్రాణానికి జన్మనిచ్చిన నర్స్ అంజలి కుల్తే

కామా అండ్ అల్‌బ్లెస్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ అంజలి కుల్తే మొదటి అంతస్తు కిటికీ వద్ద ఇద్దరు వ్యక్తులు వెనుక గేట్ దూకి కాల్పులు జరుపుతున్న దృశ్యాన్ని చూశారు. తర్వాత వారు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ మరియు అబు ఇస్మాయిల్ అని తెలిసింది.వెంటనే 20 మంది గర్భిణులను కాపాడాలని నిర్ణయించుకొని వార్డుకు పరిగెత్తి తలుపులు మూసేశారు. అందరినీ పాంట్రీ గదికి తరలించారు. ఇదే సమయంలో ఒక గర్భిణికి ప్రసవ వేదనలు మొదలయ్యాయి. బయట కాల్పుల మోత... లోపల తక్కువ కాంతితో చికిత్స అందించాల్సిన పరిస్థితి. అంజలి, ఇతర నర్సులు, డ్యూటీ డాక్టర్లు ఆ చీకట్లోనే ఒక అందమైన శిశువుకు జన్మనిచ్చారు. ఆ క్షణం కసబ్ క్రూరత్వం కింద ఒక కొత్త జీవం పుట్టడం ఆ దాడుల్లో అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది. అంజలి ఆ ధైర్యం వల్లే కసబ్‌ను గుర్తించి సాక్ష్యం చెప్పగలిగారు.

*వందల ప్రాణాలను కాపాడిన మౌనసేన (జాగిలాలు)

ముంబయి పోలీసుల బాంబు నిర్వీర్య దళానికి చెందిన మ్యాక్స్, టైగర్, సుల్తాన్, సీజర్ అనే నాలుగు జాగిలాలు ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించాయి. ఉగ్రవాదులు దాచిన ఆర్డీఎక్స్, గ్రనేడ్లు, డిటోనేటర్లను గుర్తించి మరో పెద్ద విషాదాన్ని తప్పించాయి. ముఖ్యంగా, సీజర్‌ ఒక్కటే తాజ్ హోటల్‌లో 8 కేజీల ఆర్డీఎక్స్‌ను గుర్తించడం, ఆ రోజున ముంబయికి గొప్ప వరం. ఈ నిస్సబ్ద సైనికులు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.

దాడుల ముగింపు, విషాద లెక్కలు

పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబయి చేరుకుని సీఎస్టీ, తాజ్, ఒబెరాయ్ ట్రైడెంట్ ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. 166 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 18 మంది ధైర్యవంతులైన భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. తొమ్మిది మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యారు. ఏకైకంగా సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012 నవంబర్ 21న ఉరితీశారు.

చరిత్రలో చిరస్మరణీయం

26/11 కేవలం ఒక దాడి కాదు. ఇది భయంకరానికి, ధైర్యానికి, మానవత్వానికి ప్రతీక. వందల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ... ఆ కోలాహలం మధ్య తమ ప్రాణాలు పణంగా పెట్టి ఇతరులను కాపాడిన రవి ధరణీధర్కా, మల్లిక జగద్, అంజలి కుల్తే వంటి అజ్ఞాత వీరుల కథలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారు చూపిన సాహసం, సంకల్పం... ఈ దేశం యొక్క ఆత్మ ఎంతటి బలం కలిగిందో చాటిచెబుతాయి. వారిని స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత.