రాజకీయ పార్టీలకు మత మరక మైనస్సేనా... ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పార్టీ అధికారిక వైఖరి, నేతల వ్యక్తిగత విశ్వాసాల చుట్టూ జరుగుతున్న చర్చ తీవ్ర నిరసనలకు, విమర్శలకు వేదికగా మారింది.
By: Garuda Media | 30 Aug 2026 7:00 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పార్టీ అధికారిక వైఖరి, నేతల వ్యక్తిగత విశ్వాసాల చుట్టూ జరుగుతున్న చర్చ తీవ్ర నిరసనలకు, విమర్శలకు వేదికగా మారింది. రాజకీయాల్లో నాయకులు భావజాలానికి కట్టుబడి పనిచేయడం సహజం. కానీ, ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉండటానికి లేదా అధినాయకత్వానికి దగ్గరై పదవులు పొందడానికి నేతలు తమ మత విశ్వాసాలను మార్చుకోవడం, లేదా మారినట్లు నటించడం అనే ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మత విశ్వాసం అనేది ప్రతి వ్యక్తి రాజ్యాంగబద్ధమైన వ్యక్తిగత హక్కు. అయితే, కేవలం పదవుల కోసం, రాజకీయ మనుగడ కోసం తమ మూలాలను, సొంత విశ్వాసాలను పక్కనపెట్టి ప్రార్థనలకు హాజరుకావడం లేదా బయటకు ఒక రకంగా, లోపల మరో రకంగా వ్యవహరించడం ప్రజాసేవ లక్షణంగా అనిపించుకోదు. రాజకీయం కోసం స్వీయ విశ్వాసాలను, దేవుడిని కూడా సాధనంగా వాడుకునే ధోరణి.. ఇలాంటి నాయకత్వం యొక్క నిబద్ధతను, వ్యక్తిత్వాన్ని శంకించేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
ఇటీవల కాలంలో బహిర్గతమవుతున్న కొన్ని సంఘటనలు... ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఆ పార్టీ ఏ పునాదుల ప్రాతిపదికన రాజకీయం చేస్తుందో ? అర్థమవుతోంది. ఇక పార్టీలో స్థానం నిలుపుకోవడానికి లేదా అధినాయకత్వానికి దగ్గర అవ్వడానికో, పదవుల కోసమో కొందరు నేతలు తమ స్వంత ధర్మాన్ని, విశ్వాసాలను పక్కనపెట్టడం లాంటి పరిణామాలు చూస్తుంటే.. దానిని రాజకీయ పరిణతి అనాలా లేక వ్యక్తిత్వ లొంగుబాటు అనాలా? అన్న ప్రశ్న వస్తోంది.
సొంత నమ్మకాలకే కట్టుబడి ఉండలేని నేతలు సామాన్య ప్రజలకు ఏ మేరకు విశ్వసనీయంగా ఉంటారనే అనుమానం రావడం సహజం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, అంతర్గత ఆధిపత్యం కోసం మతాన్ని ఒక అర్హతగా లేదా రాజకీయ ముసుగుగా మార్చుకోవడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. రాజకీయాన్ని, మత విశ్వాసాలను వేర్వేరుగా చూడటమే ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతికి చిహ్నం. అవకాశవాదంతో వ్యవహరిస్తూ, ప్రజల నమ్మకంతో ఆడుకునే నేతలను సమాజం ఏ విధంగా గమనిస్తుందో, భవిష్యత్తులో ప్రజాస్వామ్య వేదికపై వారి ప్రవర్తనకు ఎలాంటి తీర్పు లభిస్తుందన్నది వేచి చూడాలి.
