రిలయన్స్ మరో సంచలనం... రూ.5కే వాటర్ బాటిల్!
ఈ సందర్భంగా రిలయన్స్ ప్రకటించిన ధరలు సంచలనంగా మారాయి. ఇక్కడ 250 ఎం.ఎల్. బాటిల్ కేవలం రూ.5కే లభిస్తుంది.
By: Raja Ch | 4 Oct 2025 10:29 AM ISTరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మార్కెట్ లో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు! ఇందులో భాగంగా.. రూ.30,000 కోట్ల విలువైన దేశీయ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోకి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్.సీ.పీ.ఎల్) ప్రవేశించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ప్రకటించిన ధరలు సంచలనంగా మారాయి. ఇక్కడ 250 ఎం.ఎల్. బాటిల్ కేవలం రూ.5కే లభిస్తుంది.
అవును... దేశీయ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోకి రిలయన్స్ ప్రవేశించింది. ఇందులో భాగంగా... కొత్తగా క్యాంపా 'ష్యూర్' పేరుతో తక్కువ ధరకే మినరల్ వాటర్ ను అందిస్తూ, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న దిగ్గజ బ్రాండ్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. గతంలో క్యాంపా 'కోలా'తో శీతల పానీయాల మార్కెట్ లో ధరల యుద్ధాన్ని సృష్టించిన రిలయన్స్.. ఇప్పుడు వాటర్ బిజినెస్ లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయబోతోంది.
ఈ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తయారుచేసిన ష్యూర్ నీటిని రివర్స్ ఆస్మాసిస్, యూవీ ట్రీట్ మెంట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శుద్ధి చేస్తారు. రుచి, ఆరోగ్య ప్రయోజనాలను కలపడానికి, అన్ని ఖనిజాలను నీటిలో కలుపుతారు. కార్యాలయం, ఇల్లు, ప్రయాణంతో పాటు ఇతర రోజువారీ అవసరాలను తీర్చడానికి ఈ నీటిని పర్యావరణ అనుకూలమైన పెట్ బాటిళ్లలో ప్యాక్ చేస్తారు.
ధరల విషయంలో ప్రధానంగా రిలయన్స్ సంచలనం రేపిందనే చెప్పాలి. ప్రస్తుతం బిస్లేరి, ఆక్వాఫినా, కిన్లే వంటి బ్రాండ్లు ఒక లీటర్ నీటిని రూ.20 కు అమ్ముతుండగా.. రిలయన్స్ అదే పరిమాణాన్ని రూ.15 కే విక్రయిస్తోంది. రెండు లీటర్ల బాటిల్ ధర ఇతర బ్రాండ్లు రూ.30 - 35కి అమ్ముతుండగా... రిలయన్స్ దాని ధరను రూ.25 గా నిర్ణయించింది. అదనంగా, 1.5 లీటర్ల బాటిల్ ను రూ.20కి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో... ఈ ధరల వ్యూహం మార్కెట్ లో సరికొత్త కలకలం రేపడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఇదే వ్యూహంతో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో కాంపా కోలా తక్కువ సమయంలోనే కోకా కోలా, పెప్సీలకు గట్టి పోటీ ఇచ్చి 14 శాతం వాటాను దక్కించుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అదే విధంగా.. ఇప్పుడు నీటి మార్కెట్లోనూ ఇదే వ్యూహంతో వినియోగదారులను ఆకర్షించబోతుందని అంచనా వేస్తున్నారు.
ఈ విధంగా రిలయన్స్ రాకతో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్ లోని బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా వంటి దిగ్గజ బ్రాండ్ లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తునారు. పైగా... ఇటీవల ప్రభుత్వం ప్యాకేజ్డ్ వాటర్ పై విధించే జీఎస్టీని 18% నుంచి 5% కి తగ్గించడం రిలయన్స్ ఎంట్రీకి సరైన సమయంగా మారిందని చెబుతున్నారు.
