Begin typing your search above and press return to search.

క్విక్ కామర్స్ రేసులో అంబానీ దూకుడు.. ప్రత్యర్థులకు సవాల్

రిలయన్స్ రిటైల్ తన బలమైన మౌలిక సదుపాయాలపై ఆధారపడుతూ జియోమార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో ప్రవేశించింది.

By:  A.N.Kumar   |   26 Oct 2025 5:00 AM IST
క్విక్ కామర్స్ రేసులో అంబానీ దూకుడు.. ప్రత్యర్థులకు సవాల్
X

భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది. జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ లాంటి సంస్థలు ఇప్పటికే ఈ విభాగంలో బలమైన స్థానం సంపాదించాయి. కానీ ఇప్పుడు ఈ పోటీలోకి దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెట్టడంతో రంగం కొత్త మలుపు తిరిగింది. జియోమార్ట్ పేరుతో ముకేశ్ అంబానీ కంపెనీ ప్రవేశం, 30 నిమిషాల డెలివరీ వ్యూహం క్విక్ కామర్స్ మార్కెట్‌ను కుదిపేస్తోంది.

* జియోమార్ట్ ఎంట్రీ – దూకుడైన వ్యూహం

రిలయన్స్ రిటైల్ తన బలమైన మౌలిక సదుపాయాలపై ఆధారపడుతూ జియోమార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో ప్రవేశించింది. ఇప్పటికే ఉన్న 3,000కి పైగా రిటైల్ స్టోర్లను డెలివరీ హబ్‌లుగా మార్చి, అదనంగా 600 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 1,000 నగరాల్లో 5,000 పిన్‌కోడ్లకు డెలివరీ సేవలను విస్తరించింది.

ఇప్పటివరకు 60–90 నిమిషాల డెలివరీ సమయం ఉండగా.. ఇప్పుడు 30 నిమిషాల లోపు డెలివరీ చేసే విధానాన్ని అమలు చేసింది. దీని ప్రభావంగా కేవలం మూడు నెలల్లోనే 5.8 మిలియన్లు (58 లక్షల) కొత్త కస్టమర్లు జియోమార్ట్‌లో చేరారు. రోజువారీ ఆర్డర్లలో 200 శాతం వార్షిక వృద్ధి, త్రైమాసిక ప్రాతిపదికన 42 శాతం వృద్ధి నమోదైంది.

* మార్కెట్ సైజ్.. భారీ అవకాశాలు

కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అంచనాల ప్రకారం.. భారత క్విక్ కామర్స్ మార్కెట్ విలువ 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 64,000 కోట్లకు చేరుకోనుంది. అదే 2028–29 నాటికి రూ. 2 లక్షల కోట్లను దాటే అవకాశం ఉంది. ఈ విస్తరణలో రిలయన్స్ రిటైల్ ప్రధాన వాటా సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

* విభిన్న వ్యూహంతో ముందుకు రిలయన్స్

జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ లాంటి సంస్థలు ప్రధానంగా మెట్రో నగరాలపైనే దృష్టి సారిస్తుంటే, రిలయన్స్ మాత్రం తన దృష్టిని టైర్-II, టైర్-III నగరాలపైన, సెమీ అర్బన్ మార్కెట్లపైన కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే చిన్న పట్టణాల్లో రిలయన్స్ రిటైల్ స్టోర్ల ఉనికి, స్థానిక వినియోగదారుల ప్రాధాన్యతలపై అవగాహన.. ఇవన్నీ కంపెనీకి అదనపు బలం ఇస్తున్నాయి.

ఇక ఉత్పత్తుల పరంగా కూడా జియోమార్ట్ విభిన్నతను చూపుతోంది. నిత్యావసరాలు, గ్రోసరీస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఉత్పత్తులు కూడా అందిస్తోంది. దీని వల్ల కస్టమర్ బేస్ విస్తరించడమే కాకుండా ఆర్డర్ విలువ కూడా పెరుగుతోంది.

* పోటీదారులకు సవాల్

జియోమార్ట్ ప్రవేశంతో క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత వేడెక్కింది. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు ప్రస్తుతం ప్రధానంగా ప్రీమియం అర్బన్ మార్కెట్లలోనే సక్రియంగా ఉన్నప్పటికీ, రిలయన్స్ మాత్రం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంతో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిలయన్స్ ఇదే దూకుడు కొనసాగిస్తే.. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు దీర్ఘకాలంలో పోటీ ఇవ్వడం కష్టమవుతుంది. రిలయన్స్‌ రిటైల్ మౌలిక వసతులు, విస్తృత నెట్‌వర్క్, తక్కువ ఖర్చుతో సేవల అందుబాటు.. ఇవన్నీ కలిసి జియోమార్ట్‌ను మార్కెట్ నాయకుడిగా నిలబెట్టే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

క్విక్ కామర్స్ ఇప్పుడు కేవలం సౌకర్యం కాకుండా.. రాబోయే రిటైల్ విప్లవానికి మార్గదర్శకం అవుతోంది. ఈ రంగంలో రిలయన్స్‌ ప్రవేశం కొత్త సమీకరణాలను సృష్టిస్తోంది. వచ్చే రెండు సంవత్సరాల్లో జియోమార్ట్‌ తన దూకుడుతో మార్కెట్‌ను పూర్తిగా మార్చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంబానీ ఎంట్రీతో క్విక్ కామర్స్ రంగం కొత్త దిశలోకి అడుగుపెట్టిందని చెప్పడం అతిశయోక్తి కాదు!