మనసుల్ని దోచే బ్రాండ్ ను సొంతం చేసుకున్న రిలయన్స్
ఆ వ్యాపారం.. ఈ వ్యాపారం అన్న తేడా లేకుండా.. ఏ చిన్న అవకాశం లభించినా.. ఆయా సంస్థల్ని సొంతం చేసుకోవటంలొ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మహా దూకుడును ప్రదర్శిస్తున్నారు.
By: Garuda Media | 11 Feb 2026 2:00 PM ISTఆ వ్యాపారం.. ఈ వ్యాపారం అన్న తేడా లేకుండా.. ఏ చిన్న అవకాశం లభించినా.. ఆయా సంస్థల్ని సొంతం చేసుకోవటంలొ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మహా దూకుడును ప్రదర్శిస్తున్నారు. కరోనా వేళలో అందరూ తమ కంపెనీల నిర్వహణ మీద బోలెడంత ఆందోళనకు గురైతే.. అందుకు భిన్నంగా నాన్ స్టాప గా పలు సంస్థలను కొనుగోలు చేయటం.. తమ కంపెనీ వాటాల్ని భారీ ధరలకు అమ్మటం ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కరోనా టైంలోనే అంతటి వేగాన్ని ప్రదర్శించిన ముకేశ్ అంబానీ.. ఇప్పుడు మరెంత జోరును ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ మధ్యనే ఆస్ట్రేలియాకు చెందిన గుడ్ నెస్ గ్రూపు గ్లోబల్ లో మెజార్టీ వాటాను దక్కించుకోవటం తెలిసిందే. బెవరేజస్ బ్రాండ్ గా దీనికి పేరుంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమంటే ఆరోగ్యకరమైన పానీయాల్ని తయారు చేస్తుందన్న పేరుంది. ఆస్ట్రేలియాతో పాటు 20 కంటే ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉత్పత్తుల్ని అమ్ముతోంది. షుగర లేని.. సహజమైన తీపితో ఇచ్చే ప్లాంట్ బేస్డ్ స్వీటెనర్ ను వీటి ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి రూపొందించిన హైడ్రేషన్ డ్రింక్ బ్రాండ్ కూడా ఈ కంపెనీదే.
2023 ఆర్థిక సంవత్సరంలో గుడ్ నెస్ గ్రూప్ గ్లోబల్ వార్షిక నికర విక్రయాలు దాదాపు రూ.140 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతారు. ఏడాదికి ఏడాది తన ఉత్పత్తుల అమ్మకాల్ని పెంచుకుంటూ పోతోంది. త్వరలోనే భారత్ లోని పలు ప్రధాన నగరాల్లోని రిలయన్స్ డిస్ట్రిబ్యూషన్ (రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్) ద్వారా అందుబాటులోకి తేనున్నారు. తొలుత ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో మొదట ప్రవేశ పెడతారు. అనంతరం దేశ వ్యాప్తంగా విస్తరిస్తారు.
కట్ చేస్తే.. తాజాగా మరో ప్రముఖ బ్రాండ్ ను రిలయన్స్ సొంతం చేసుకుంది. తమిళనాడుకు చెందిన సదరన్ హెల్త్ ఫుడ్స్ ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.156.42 కోట్లుగా చెబుతున్నారు. వంద శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో.. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తుల సెగ్మెంట్ లోకి రిలయన్స్ ఎంట్రీ ఇచ్చినట్లైంది. ఇంతకూ ఈ సంస్థ ఏ తరహా ఉత్పత్తుల్ని తయారు చేస్తుందన్న విషయంలోకి వెళితే.. మన్నా బ్రాండ్ పేరుతో ఆరోగ్య ఆహార ఉత్పత్తులను రెండు దశాబ్దాలుగా అమ్ముతోంది. తక్కువ ధరల్లో అంతర్జాతీయ ప్రమాణాలున్న ఆహార ఉత్పత్తుల్ని అమ్మటమే తమ లక్ష్యంగా రిలయన్స్ చెబుతోంది.
ఈ సంస్థకు చెందిన మన్నా బ్రాండ్ పేరుతో మొత్తం పాతిక కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందిస్తోంది. చిన్నారుల నుంచి అన్ని వయసుల వారికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్న ప్రజల తీరుకు అనుగుణంగా ఈ సంస్థ కొనుగోలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు.. దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న మన్నా బ్రాండ్ రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా పాపులర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పి ముగించాలి. గడిచిన ఐదేళ్ల కాలంలో పాతిక కంటే ఎక్కువ సంస్థల్ని రిలయన్స్ ను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వినియోగించింది. ఇటీవల కొనుగోలు చేసిన సంస్థల ఉత్పత్తులు భిన్నంగా ఉండటం.. వేర్వేరు రంగాలకు చెందిన వాటిని కొనుగోలు చేయటం ద్వారా తన ఫోర్ట్ ఫోలియోను విస్తరించుకుంటూ వెళుతుందని చెప్పాలి.
