విశాఖలో ‘రిలయన్స్’ డిజిటల్ విప్లవం.. ₹1.6 లక్షల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్!
గతంలో విశాఖపట్నం అంటే గుర్తుకు వచ్చేది బీచ్.. కొన్ని చారిత్రక ప్రదేశాలు కానీ.. ఆ పేరు వింటేనే ఇప్పుడు ‘గ్లోబల్ టెక్ హబ్’ గుర్తొస్తోంది.
By: Tupaki Political Desk | 28 April 2026 2:00 PM ISTగతంలో విశాఖపట్నం అంటే గుర్తుకు వచ్చేది బీచ్.. కొన్ని చారిత్రక ప్రదేశాలు కానీ.. ఆ పేరు వింటేనే ఇప్పుడు ‘గ్లోబల్ టెక్ హబ్’ గుర్తొస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన ఈ ₹1.6 లక్షల కోట్ల భారీ పెట్టుబడి కేవలం విశాఖకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసే ‘గేమ్ ఛేంజర్’ మారుతోంది.
విశాఖపట్నం సముద్ర తీరం ఇప్పుడు డేటా ప్రవాహానికి వేదిక కాబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ విశాఖలో 1.5 గిగావాట్ల సామర్థ్యంతో గిగాస్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు గూగుల్ ప్రకటించిన 1GW (గిగావాట్) ప్రాజెక్టే అతిపెద్దదిగా భావించగా, ఇప్పుడు రిలయన్స్ దానిని అధిగమించి భారత్‌ను గ్లోబల్ డేటా సెంటర్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టబోతోంది.
ఎందుకింత ప్రత్యేకం?
ఈ ప్రాజెక్టు కేవలం డేటా స్టోరేజ్ గురించి మాత్రమే కాదు.., ఇది ఒక సంపూర్ణమైన ‘గ్రీన్ టెక్’ ఎకోసిస్టమ్. 1.5 గిగావాట్ల సామర్థ్యం అంటే అది లక్షలాది సర్వర్లను ఏకకాలంలో నడపగలదు. ఇది కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలకు వెన్నుముకగా నిలుస్తుంది. డేటా సెంటర్లకు నిరంతరం విద్యుత్ అవసరం. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు రిలయన్స్ దీని కోసం సొంతంగా సోలార్ ప్లాంట్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. ప్రతి దశలోనూ అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ, విశాఖను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డేటా హబ్‌గా తీర్చిదిద్దుతారు.
విశాఖకే ఎందుకు..?
రిలయన్స్ విశాఖను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయి. సముద్ర గర్భ కేబుల్స్.. విశాఖ తీరం అంతర్జాతీయ డేటా కేబుల్స్‌కు అనుసంధానమై ఉండడం ఒక కారణం. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. పారిశ్రామిక వృద్ధికి ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, విశాఖలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులు ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా మారనున్నారు.
ఆర్థిక మరియు ఉపాధి ప్రభావం
₹1.6 లక్షల కోట్ల పెట్టుబడి అంటే అది ఒక రాష్ట్ర బడ్జెట్‌తో సమానం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు విశాఖ ప్రాజెక్టు ఉపాధి కల్పిస్తుంది. డేటా సెంటర్లు రావడం వల్ల క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, ఏఐ స్టార్టప్‌లు విశాఖకు తరలివస్తాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్, సేవా రంగాలు పుంజుకుంటాయి.
ఒకప్పుడు కేవలం స్టీల్ ప్లాంట్‌కు గుర్తింపు సంపాదించుకున్న విశాఖ, ఇప్పుడు రిలయన్స్, గూగుల్ వంటి సంస్థల రాకతో ‘డిజిటల్ సముద్రం’లా మారుతోంది. రిలయన్స్ నిర్మించబోయే గిగాస్కేల్ ప్రాజెక్టు పూర్తయితే, డేటా సెంటర్ల రంగంలో చైనా, అమెరికా వంటి దేశాలకు భారత్ గట్టి పోటీ ఇస్తుంది. ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ఊపిరి పోయడమే కాకుండా, రాబోయే తరాలకు ఆధునిక టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. విశాఖ ఇకపై కేవలం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు, సిటీ ఆఫ్ డేటా కూడా!
