మా ఆవిడ అక్రమాస్తులు రూ.210 కోట్లు.. మహిళా మంత్రి భర్త సంచలనం
ఉత్తరాఖండ్ మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేఖా ఆర్య. ఆమె విద్యావంతురాలైన మహిళా నాయకురాలు.
By: Garuda Media | 17 Oct 2026 10:48 AM ISTమా ఆవిడకు అక్రమాస్తులు రూ.210 కోట్లకు పైనే ఉన్నాయి..తెలుసా? అంటూ ఏకంగా కట్టుకున్న భర్తే షాకింగ్ ఆరోపణలు చేయటం సమకాలీన రాజకీయాల్లో చూడని అంశం. రాజకీయ ప్రత్యర్థులపై చేసే ఈ తరహా ఆరోపణల్ని.. భార్యపైన భర్త చేయటం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. ఒక మహిళా మంత్రిపై ఆమె భర్త స్వయంగా చేసిన ఆరోపణలు ఒక ఎత్తు అయితే.. సదరు భర్తగారి బ్యాక్ గ్రౌండ్ ఆయనగారి నేరాల చిట్టా చూస్తే.. విస్మయానికి గురి కావటం ఖాయం. ఇంతకూ అసలేమైందంటే..
ఉత్తరాఖండ్ మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేఖా ఆర్య. ఆమె విద్యావంతురాలైన మహిళా నాయకురాలు. ఆమె పక్కనున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన వివాదాస్పద రాజకీయ నాయకుడ్ని 2004లో పెళ్లి చేసుకున్నారు. అతడి పేరు గిర్దారీ లాల్ సాహు. ఆసక్తికరమైన అంశం ఏమంటే రేఖా ఆర్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఆమె భర్త ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనాయకుడు. తాజా వివాదంలోకి వెళితే..ఈనెల పదిహేనున (గురువారం) డెహ్రాడూన్ లోని కాంట్ పోలీస్ స్టేషన్ లో తన భర్త గిర్దారీ లాల్ సాహుపై మంత్రి రేఖాఆర్య అధికారికంగా ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భర్త తనను చంపేందుకు ఒక మహిళతో కలిసి ప్లాన్ చేస్తున్నట్లుగా ఆమె ఆరోపించటంతో ఈ వివాదం వెలుగు చూసింది.
దాదాపు ఎనిమిది.. తొమ్మిది నిమిషాల నిడివి ఉన్న ఆడియోక్లిప్ ను పోలీసులకు సమర్పించిన ఆమె.. అదే రోజు రాత్రి సోషల్ మీడియాలో తీవ్రమైన ఆవేదనతో.. కన్నీరు పెట్టుకుంటూ ఒక వీడియో విడుదల చేశారు. తనకు.. తన మైనర్ పిల్లలకు తన భర్త నుంచి ప్రాణహాని ఉందని అందులో పేర్కొనటంతో ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా ఒక మహిళా మంత్రికి ఎదురైన గృహహింస వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తర్వాతి రోజు ఆమె భర్త గిర్దారీ లాల్ సాహు ఒక కౌంటర్ వీడియోను విడుదల చేశారు. అందులో తన భార్య కం మంత్రిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య అక్రమాస్తులు రూ.210 కోట్లకు ఉంటాయని ఆరోపించారు.
ఇక.. భర్తపై రేఖా ఆర్య చేసిన ఆరోపణలు మరిన్ని అంశాలు ఉన్నాయి. తనను పెళ్లి చేసుకోవటానికి ముందే తన భర్తకు పెళ్లై..పిల్లలు ఉన్నారని.. ఆ విషయాన్ని దాచి పెట్టి తనను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు.. తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. వాటిని తాను నిలదీసినందుకు తనపై భౌతికదాడులు చేస్తూ.. కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నట్లుగా ఆరోపించారు. అంతేకాదు.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని కంపెనీల డైరెక్టర్ పదవుల నుంచి తనను తొలగించటానికి ప్రయత్నించినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మరోమహిళతో కలిసి తన భర్త తనను చంపే ప్లాన్ కు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనికి కౌంటర్ గా తన భార్య అవినీతిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని డిమాండ్ చేయటం గమనార్హం.
రేఖా ఆర్య విషయానికి వస్తే.. రాజకీయాలు భర్త కారణంగా ఎంట్రీ ఇచ్చినా.. తన స్వయంశక్తితో.. తన చతురతతో పార్టీలో ఎదగటమే కాదు.. మంత్రి పదవిని సొంతం చేసుకోవటంలో కీలకభూమిక పోషించారని చెబుతారు. అదే సమయంలో ఆమె భర్త విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తాయి. నిజానికి వీరిద్దరి మధ్య 2004లో పెళ్లి జరిగినప్పటికి.. కుటుంబంలోని గొడవల్ని ఆమె ఎప్పుడూ బయటపెట్టింది లేదు. పిల్లల భవిష్యత్తు కోసం తాను మౌనంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల గొడవలు హద్దులు దాటి.. హత్య కుట్ర వరకు వెళ్లటంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు.
ఇక.. ఆమె భర్త గిర్దారీ లాల్ సాహు అలియాస్ పప్పు గిర్దారీ విషయానికి వస్తే.. అతడి నేర చరిత్ర పెద్దదే. తరచూ తన తీరుతో వివాదాల్లో చిక్కుకుంటారన్న పేరుంది. అతడిపై పలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబరులో అల్మోరాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. పెళ్లి కానివారు ఉంటే త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదంటే బీహార్ నుంచి రూ.20వేలు.. రూ.25 వేలకు అమ్మాయిలు దొరుకుతారంటూ అవమానకర రీతిలో చేసిన వయాఖ్యలు పెను దుమారంగా మారాయి. ఈ వ్యాఖ్యల కారణంగా బీహార్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారానికి కారణమైంది. అన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా తప్పు పట్టటంతో క్షమాపణలు చెప్పి తగ్గారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పరిసరప్రాంతాల్లో పలు వివాదాస్పద భూ లావాదేవీలు.. క్రిమినల్ ఆరోపణల్లో ఆయన పేరుప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.
యూపీలోని బరేలీ ప్రాంతానికి చెందిన ఇతగాడు వ్యాపారవేత్తగా.. రాజకీయ నాయకుడిగా చలామణి అవుతుంటాడు. గడిచిన మూడు దశాబ్దాలుగా అతడిపై పలు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీజేపీకి చెందిన ఇతను చిన్నపాటి రాజకీయ నేత. అయితే.. భార్య ఉత్తరాఖండ్ మహిళా మంత్రిగా ఉండటంతో అతడికి రాజకీయంగా పలుకుబడి పెరిగింది. అయితే.. ఇతడిపై జంట హత్య నేరారోపణ బలంగా ఉంది. 1990 జూన్ లో బరేలీలో ఒక జైన్ దంపతులను దారుణంగా హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అతడు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నకిలీ పత్రాలతో వారి ఆస్తులను లాక్కునేందుకు జంట హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాకుండా ఉండేలా మేనేజ్ చేయటం చూస్తే.. అతగాడి క్రైం టాలెంట్ ఎంతో అర్థమవుతుంది. జంట హత్యల ఉదంతం చోటు చేసుకున్న 31 ఏళ్లకు బరేలీ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయటంతో.. ఆయన భార్యకు సైతం ఈ ఉదంతం గురించి తెలిసినట్లు చెబుతారు.
అంతేకాదు 2004లో రేఖా ఆర్యను పెళ్లి చేసుకునే సమయానికి తనకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పినట్లుగా భర్తపై తీవ్ర ఆరోపణలు చేశారు. బరేలీకి చెందిన కల్పనా మిశ్రా అనే మహిళ తన ఆధార్.. పాస్ పోర్టులలో గిర్దాలీ లాల్ సాహును తన భర్తగా పేర్కొనటం.. ఆమెను తన మేనేజర్ గా తన భర్త పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇలా.. వరుస ఆరోపణలతో ఉన్న అతడి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇన్ని తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికి ఇంతకాలం అతను రాజకీయ నాయకుడిగా చెలామణి కావటం.. చట్టాలు అతడి నేరాలపై లెక్కలు తేల్చకపోవటం గమనార్హం. తాజాగా అతడిపై రాష్ట్ర మంత్రిగా ఉన్న భార్య చేసిన ఫిర్యాదు.. ఈసారి రోటీన్ కు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
