Begin typing your search above and press return to search.

ఫ్రిడ్జ్ లో ఫుడ్.. ఎలా వాడాలి? ఈ లెక్క తెలుసా?

ఇరవై ఏళ్ల క్రితం ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండటం అనేది ఒక విలాసం. ఇప్పుడు అవసరం కాదు అత్యవసరం. అది లేని ఇల్లు అన్నది తలుచుకోవటానికే ఇబ్బంది.

By:  Garuda Media   |   7 Sept 2025 10:33 AM IST
ఫ్రిడ్జ్ లో ఫుడ్.. ఎలా వాడాలి? ఈ లెక్క తెలుసా?
X

ఇరవై ఏళ్ల క్రితం ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండటం అనేది ఒక విలాసం. ఇప్పుడు అవసరం కాదు అత్యవసరం. అది లేని ఇల్లు అన్నది తలుచుకోవటానికే ఇబ్బంది. అంతలా ఫ్రిడ్జ్ మీద ఆధారపడటం ఎక్కువైంది. చూస్తుండగానే ఫ్రిడ్జ్ ను ఒక పెద్ద అల్మారాలా వాడేస్తున్న రోజులు వచ్చాయి. ఒకప్పుడు వండుకున్న ఆహారం.. పాలు.. పెరుగు.. చల్లటి మంచినీళ్ల కోసం వాడే వారు. ఇప్పుడు పప్పులు మొదలు సమస్తం అందులో ఉంచేస్తున్న పరిస్థితి. మారిన వాతావరణానికి కొద్దిరోజులకే పిండ్లు.. రవ్వలకు పురుగులు పట్టేయటం..పండ్లు.. పచ్చళ్లు ఇలా ప్రతి దాన్ని ఫ్రిడ్జ్ లో దాచేయటం ఎక్కువైంది.

మరి.. ఇంతలా వాడుతున్న ఫ్రిడ్జ్ ను ఎలా వాడాలి? అందులో ఉంచే ఫుడ్ ను ఎలా వినియోగించాలి? అన్నది అసలు ప్రశ్న. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అన్నది చూసుకోవాలి. ఎందుకంటే.. ఫ్రిడ్జ్ లో ఉంచే పదార్థాల్ని వాడే విషయంలోనూ కొన్ని లెక్కలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది.

ఫ్రిడ్జ్ లోని ఆహారాన్ని ఎలా వినియోగించాలి? అన్న విషయానికి సంబంధించి ఈ అంశాల్ని మీరు ఫాలో అవుతున్నారా? లేదా? చూసుకోండి. అవేమంటే..

- వండిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే అందులో ఉంచాలి. అదే సమయంలో రోజు మొత్తం బయట ఉంచేసి.. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టటం సరికాదు.

- వేడిగా వండిన ఆహార పదార్థాన్ని చల్లారిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెడితే మూడు నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి. లేదంటే.. అప్పటికే బ్యాక్టీరియా చేరి పాడవుతాయి. వాసన రాకుంటే ఫుడ్ బాగున్నట్లుగా భావిస్తాం. కానీ.. మన పొట్ట మాత్రం చెడిపోయి.. ఇబ్బందికి గురవుతుందన్నది మర్చిపోకూడదు.

- అదే సమయంలో ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే వేడి చేసి తినటం ఏ మాత్రం మంచిది కాదు. రూం టెంపరేచర్ వచ్చే వరకు బయట ఉంచి ఆ తర్వాత మాత్రమే తినాలి.

- ఒకవేళ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే వేడి చేయాలంటే.. అది ఆవిరి మీద చేయాలే తప్పించి.. నేరుగా పొయ్యి మీద పెట్టటం మంచిది కాదు.

- ఫ్రిడ్జ్ట్ లోపల టెంపరేచర్ ఎంత ఉండాలన్నది దానికో లెక్కుంది. 4 నుంచి 7 డిగ్రీల వద్ద మనకు కావాల్సిన విధంగా ఆహారం నిల్వ ఉంటుంది. అంతకంటే ఎక్కవ కానీ తక్కువ కానీ అవసరం లేదు.

- ఫ్రిజ్ లో ఉంచే ఏ పదార్థమైనా కచ్ఛితంగా మూత పెట్టే లోపల ఉంచాలి. ఎయిర్ టైట్ కంటైనర్ అయితే మరీ మంచిదన్నది మర్చిపోకూడదు. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు.

- కోడిగుడ్లను చాలామంది ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. కానీ.. అవి బయట ఉంచటమే మేలు. ఫ్రిడ్జ్ లో ఉంచటం ద్వారా ఒంటికి అవసరమైన పోషకాలు అందించవన్నది రుజువైంది.

- మాంసం.. చేపల్ని డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచి వారం తర్వాత కూడా వండుకోవచ్చు. కాకుంటే వంటకు ముందు మాత్రం అవి రూం టెంపరేచర్ వద్దకు వచ్చిన తర్వాతే వాడుకోవాలి.

- చాలామంది పండ్ల రసాల్ని కూలింగ్ కోసమని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. అదే మాత్రం మంచిది కాదు. అదే సమయంలో పండ్లు.. కూరగాయలు ఏవైనా వారం లోపల వాడుకోవాలి.

- ఫ్రిడ్జ్ లో ఉంచే ఆహారపదార్థాల్లో కొన్ని న్యూటియంట్లు తగ్గిపోతాయి. అందుకే అవసరమైతే తప్పించి పండ్లు.. కూరగాయాల్ని ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవటం.. వండుకోవటం మంచిదన్నది మర్చిపోకూదు. అవసరానికి మించిన ఫ్రిడ్జ్ వాడకం అవసరం లేదన్నది మర్చిపోకూడదు.