Begin typing your search above and press return to search.

దేశ‌వ్యాప్తంగా 'సంస్క‌ర‌ణోత్స‌వాలు'..: విఫ‌క్షాలు ఫైర్‌.. విష‌యం ఏంటి?

సుమారు మూడు నెలల పాటు సాగే ఈ విస్తృత ప్రచారంలో భాగంగా మొత్తం 1,300 ప్రధాన సంస్కరణలను ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా 1,639 కార్యక్రమాలను వివిధ దశల్లో చేప‌ట్ట‌నున్నారు.

By:  Garuda Media   |   28 Sept 2026 9:52 AM IST
దేశ‌వ్యాప్తంగా సంస్క‌ర‌ణోత్స‌వాలు..: విఫ‌క్షాలు ఫైర్‌.. విష‌యం ఏంటి?
X

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వ‌చ్చే నెల 2వ తేదీ(గాంధీ జ‌యంతి) నుంచి సంస్క‌ణోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు స‌హా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సంస్క‌ర‌ణోత్స‌వాల‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల‌ని అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది కేంద్ర స‌ర్కారుకు.. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీకి బాకాలు ఊద‌డ‌మేన‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏ ప్ర‌ధానీ ఇలా.. పిలిచి మ‌రీ పొగిడించుకున్న దాఖ‌లాలు లేవ‌ని అంటున్నారు. కానీ.. మోడీ హ‌యంలోనే ఇలా.. అడిగి, పిలిచి మ‌రీ త‌న‌నుతాను పొగిడించుకుంటున్నార‌ని.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ వంటివారు దుయ్య‌బ‌డుతున్నారు.

అస‌లేంటిది?

గత 12 ఏళ్ల న‌రేంద్ర మోడీ పాలనలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకువచ్చిన కీలకమైన సుపరిపాలన, సంస్థాగత, ప్రజా సంక్షేమ మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఒక మెగా ప్రచారమే సంస్క‌ర‌ణోత్స‌వాలు. అక్టోబర్ 2 నుంచి ఈ సంస్కరణోత్స వ కార్యక్రమాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్ర‌ధాన లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాల నా సంస్కరణలు, డిజిటల్ సేవల విప్లవం, ప్రజల జీవితాలను సులభతరం చేసిన విధానాలను దేశవ్యాప్తంగా మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డ మే. దీనికిగాను అయ్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రించ‌నుంది. అయితే.. ఎంత అనేది నిర్ణ‌యించ‌లేదు.

సుమారు మూడు నెలల పాటు సాగే ఈ విస్తృత ప్రచారంలో భాగంగా మొత్తం 1,300 ప్రధాన సంస్కరణలను ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా 1,639 కార్యక్రమాలను వివిధ దశల్లో చేప‌ట్ట‌నున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అక్టోబర్ నెలలోనే దాదాపు 454 కార్యక్రమాలు, నవంబర్‌లో 349 కి పైగా ఈవెంట్‌లు జరగనున్నాయి. ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా.. నాయ‌కులు, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. ప్రజలతో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన విభిన్న వర్గాల ప్రజలతో ఇంటరాక్టివ్ సెషన్‌లు ఏర్పాటు చేస్తారు.

విప‌క్షాల ఫైర్‌..

కాగా.. ఈ సంస్క‌ర‌ణోత్స‌వాల‌పై కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీపార్టీ స‌హా.. ఇత‌ర ప‌క్షాలు పెద‌వి విరుస్తున్నాయి. దేశంలో సంస్క‌ర ణ‌లు అంటే.. యూపీఐ చెల్లింపుల‌పై జీఎస్టీ విధించ‌డ‌మా.. పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మా? సామాన్యులు కొనుగోలు చేసే నిత్యావ‌ర‌స‌రాల ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మా? అని నిల‌దీస్తున్నారు. ఒక‌వైపు నిరుద్యోగం.. ఉపాధి క‌ల్ప‌న వంటివి అట‌కెక్కాయ‌ని.. వాటిపై దృష్టి పెట్టాల‌ని నాయ‌కులు కోరుతున్నారు. కానీ.. ప్ర‌ధాని ప‌నిగ‌ట్టుకుని త‌న‌ను పొగిడించుకునే కార్య‌క్ర‌మానికి, బాకాలు ఊదించుకునే కార్య‌క్ర‌మానికి తెర‌దీశార‌ని నాయ‌కులు దుయ్య‌బ‌డుతున్నారు. తాము ఈకార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటామ‌ని కాంగ్రెస్ పేర్కొంది.