Begin typing your search above and press return to search.

మరోసారి సర్ : వింటర్ లో హీటెక్కించే పార్లమెంట్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు బీహార్ లాంటి అతి పెద్ద రాష్ట్రాన్ని గెలిచి తన ఖాతాలో వేసుకుంది ఎన్డీయే.

By:  Satya P   |   1 Dec 2025 9:17 AM IST
మరోసారి సర్ : వింటర్ లో హీటెక్కించే పార్లమెంట్
X

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు బీహార్ లాంటి అతి పెద్ద రాష్ట్రాన్ని గెలిచి తన ఖాతాలో వేసుకుంది ఎన్డీయే. ఆ విజయోత్సాహంతో అధికార పార్టీ పార్లమెంట్ లోకి పూర్తి ధీమాతో అడుగుపెడుతోంది. అదే సమయంలో విపక్ష శిబిరంలో కొంత నైరాశ్యం కనిపిస్తోంది. ఇండియా కూటమిది ఓడిన బాధ. అయితే అధికార పక్షాన్ని గట్టిగా టార్గెట్ చేసి ఇరుకున పెట్టడానికి అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీదనే కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అన్నీ ఇపుడు దృష్టి సారిస్తున్నాయి.

సర్ తో ఉక్కిరిబిక్కిరి :

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ మీద విపక్షాలు మూకుమ్మడిగా అధికార ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో బీహార్ లో అమలు చేస్తున్న సర్ తో మొత్తం వర్షార్పణం అయ్యాయి. అయితే ఈసారి కూడా సర్ రెండవ దశ మీద విపక్షం చర్చకు పట్టుబట్టనుంది. బీహార్ గెలుపుని ఎన్డీయే ఆస్వాదించకుండా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ ఇదే అంశాన్ని సీరియస్ గా పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తారు అని అంటున్నారు. ఒక సర్ అంశం అమలు చేయడం మీద అనేక రాష్ట్రాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఇపుడు ఎన్డీయే సర్కార్ ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టేందుకు సమాయత్తం అవుతున్నాయి.

ఢిల్లీ కాలుష్యం బిగ్ ఇష్యూ :

అంతే కాదు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మీద ప్రతిపక్షం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనుంది. ఈసారి అధిక శాతం కాలుష్యంతో జనాలు నరకం చూస్తూంటే కేంద్రం ఈ విషయంలో పెద్దగా మాట్లాడకపోవడమేంటి అన్నది విపక్షాల విమర్శ కాబోతోంది. దీనిని పరిష్కారం చూపించాలని డిమాండ్ చేయబోతోంది. నానాటికి ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతూంటే కేంద్రం ఎందుకు మాట్లాడదు అని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రశ్నించారు అంటే దీని మీద రచ్చ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ఉందని దాని మీద కేంద్రం చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి కోరనుంది.

ఎర్రకోట కారు పేలుడు మీద :

ఇక ఈ మధ్యనే జరిగిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటన ఉగ్రదాడి పైన కేంద్ర ప్రభుత్వం తానుగా ఒక కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో ఏకంగా పదిహేను మంది అమాయకులు చనిపోయారు. అలాగే మరో ఇరాఇ మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇది అత్యంత కీలక అంశం కాబట్టి దీని మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక ఈ కేసులో పురోగతి గురించి సభకు వివరించనున్నారు.

మొత్తం పదమూడు బిల్లులు :

కేంద్ర ప్రభుత్వం ఈసారి పార్లమెంట్ ముద్ను 13 బిల్లులను తీసుకుని రానుంది. వాటిని అమోదించుకోవాలని చూస్తోంది. అందులో జాతీయ రహదారులు సవరణ బిల్లు, అణుశక్తి బిల్లు, కార్పొరేట్ చట్టాలు సవరణ బిల్లు, బీమా చట్టాలు సవరణ బిల్లు, భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు -2025 వంటివి ఉన్నాయి. అదే విధంగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు ఆరోగ్య భద్రత జాతీయ భద్రతా సెస్సు బిల్లు-2025 ను ప్రవేశపెట్టనున్నారు.