మళ్ళీ పుడతామా...ఏంటి ?
అవును మళ్ళీ పుడతామా ఏంటి. ఇది వేదాంతం ఒంటబట్టిన వారికి మాత్రమే కాదు ప్రతీ సాధారణ మనిషిలో తలెత్తే ప్రశ్న.
By: Satya P | 19 July 2026 6:00 PM ISTఅవును మళ్ళీ పుడతామా ఏంటి. ఇది వేదాంతం ఒంటబట్టిన వారికి మాత్రమే కాదు ప్రతీ సాధారణ మనిషిలో తలెత్తే ప్రశ్న. దీనిని పాజిటివ్ గా తీసుకోవచ్చు. అలాగే నెగిటివ్ గా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఈ జీవితమంతా తమకు తోచిన విధంగా ఆనందంగా విలాసంగా గడిపేస్తే పోలా అని ఆలోచించే వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినపుడల్లా జన్మల గురించి కూడా ఆలోచనలు వస్తూంటాయి. మళ్ళీ జన్మ ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది ఆలోచిస్తూంటారు. వచ్చే జన్మ గత జన్మ ఇలా చర్చలు చేసే వారు కూడా సగటు జనాల నుంచి వేదాంతులు మేధావుల దాకా ఉన్నారు. ఇంతకీ జన్మలు ఉన్నాయా. ఒక్కటే జీవితం అంటున్నారు కదా మరి ఇక్కడితో సరి అయిపోతే ఎలా అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తున్న నేపధ్యం ఉంది.
ఆధ్యాత్మిక కోణంలో :
అయితే జన్మలు ఉన్నాయి అని అవి ఒక్కటి కాదు వేల వేలు అని ఆధ్యాత్మికత చెబుతోంది. మనిషి అంటే కేవలం కంటికి కనిపించే శరీరం కాదని అది పంచ భూత మిళితం అని అంటారు. ఇక్కడ శరీరం ఇక్కడే పంచ భూతాలలో విలీనం అయ్యాక లోపల ఉన్న ఆత్మ మాత్రం పదిలంగానే ఉంటుందని అది కొత్త శరీరం వెతుక్కునే పనిలో ఉంటుందని అలా జన్మ జన్మలు కొనసాగుతూనే ఆత్మ శాశ్వతంగా ఉంటుందని ఆధ్యాత్మికత చెబుతోంది. ఇక గత జన్మల గురించి అలాగే వచ్చే జన్మల గురించి భారతీయ ఆధ్యాత్మికతలో చాలా లోతైన విశ్లేషణ ఉంది. పైగా ఇదంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఒక సైకిల్ గా సాగుతుందని కూడా చెబుతుంది.
చేసుకున్న దాని ఫలితమే :
ఏ జీవుడు అయినా తాను ప్రస్తుత జన్మలో చేసుకున్న దాని ఫలితమే వచ్చే జన్మ వస్తుందని కూడా కర్మ సిద్ధాంతం చెబుతుంది. అంటే గత జన్మలో మనం చేసిన మంచి లేదా చెడు కర్మల ఆధారంగానే ప్రస్తుత జన్మ ఆధారపడి ఉంటుందని అంటుంది. అయితే గత జన్మ జ్ఞాపకాలు సాధారణంగా ఏ మనిషికి గుర్తుండవు. ఇవి మనసులో అచేతనంగా సబ్ కాంక్షస్ లో నిక్షిప్తం అయి ఉంటాయని అంటారు. ఇక భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మకు చావు లేదని ఉంది. మరణం తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా మరో శరీరాన్ని ధరిస్తుందని కూడా ఆధ్యాత్మిక కోణంలో చెబుతారు.
పునర్జన్మలు ఉన్నాయా :
మనిషి మళ్ళీ మళ్లీ పుడతాడా పునర్జన్మలు ఉన్నాయా అంటే వీటికి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. ప్రతీదీ సైన్స్ కి అందుతుందా అంటే దానికి కూడా చెప్పడం కష్టమే. కానీ మత విశ్వాసాలను గట్టిగా నమ్మేవారు మాత్రం పుట్టిన ప్రతీ జీవికి మరణం తప్పదని అలాగే తిరిగి జననం తప్పదని అంటారు. ఇక పునర్జన్మలు అన్నది యుగాలకు అతీతంగా జరుగుతున్న చర్చ. దానికి లాజికల్ ఎండ్ అన్నది లేదు. ఇది అనేక కాలాలుగా నమ్మకం మీదనే ఆధారపడి సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ తత్వశాస్త్రం మధ్య తీవ్రమైన చర్చనీయాంశంగా ఈ పునర్జన్మల విషయం ఉంది.
సైన్స్ చెప్పేది ఇదే :
ఆధ్యాత్మిక భావన చూస్తే జన్మలు ఎన్నో ఉంటాయి. ఆత్మకు జన్మలు ఎత్తడమే పని అని కూడా గట్టిగా చెబుతుంది. అయితే సైన్స్ మాత్రం దానిని కొట్టిపారేస్తోంది. శాస్త్రీయ దృక్పథం నుంచి చూస్తే ఇవన్నీ నమ్మకాలు అని అంటోంది. అలాగే ఆధునిక వైద్యం సైన్స్ ప్రకారం చూసినా పునర్జన్మలకు ఎలాంటి ఆధారాలు లేవు. మనిషి మరణించిన తర్వాత మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఆ తరువాత ఇక ఏమీ ఉండదని అంటుంది. అంటే ఆ మనిషి జీవితం అక్కడితో ఆగిపోతుంది అని సైన్స్ అంటుంది. ఆత్మ అన్నది సైన్స్ దృష్టి కోణంలో లేదు. కాబట్టి పునర్జన్మల విషయంలో సైన్స్ ఏ ఆధారాలూ లేవని అంటుంది.
జీవ సంబంధమైన ప్రక్రియగానే :
సైన్స్ ప్రకారం చూస్తే మనిషి పుట్టుక చావూ రెండూ ఒక జీవ సంబంధమైన ప్రక్రియగానె ఉంటుంది. అండం-శుక్రకణాల కలయికతో పిండం ఏర్పడటం అనేది ఒక జీవసంబంధమైన ప్రక్రియగా సైన్స్ చెబుతుంది. అయితే పూర్వ జన్మల గురించి అనేక రకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ పూర్వ జన్మల గురించి చెప్పిన విషయాలపై దశాబ్దాల పాటు అనేక రకాలుగా అంతర్జాతీయ స్థాయిలోనే పరిశోధనలు చేశారు. కానీ వీటిని చాలా మంది శాస్త్రవేత్తలు ఖండించారు. మొత్తం మీద చూస్తే ఆధారాలు ఉంటేనే నమ్ముతామని సైన్స్ అంటుంది. అధ్యాత్మికతకు ఆధారాలు ఏమిటి అని మరో వైపు వాదనలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన మాత్రం అలా చర్చలు సాగుతూనే ఉన్నాయి. దాంతో పునర్జన్మ అనేది పూర్తిగా విశ్వాసం నమ్మకానికి సంబంధించిన అంశంగానే ఈ రోజుకీ మిగిలిపోయింది. అంతే కాదు భౌతిక శాస్త్రానికి ఇది అంతుచిక్కని విషయంగానే మిగిలిపోయిందని అంటున్నారు.
