ట్రిపుల్ఆర్ సూపర్ యాక్టర్...పొగుడుతున్నట్లేనా ?
మరి అలాంటి ట్రిపుల్ ఆర్ మీద పీవీ సునీల్ కుమార్ కి ఎంతో అభిమానం ఉందని అంటున్నారు.
By: Satya P | 5 Jan 2026 9:27 AM ISTట్రిపుల్ ఆర్ అంటే ఎవరో తెలుసు కదా. రాజకీయాల్లో మూడు ఆర్ లు కలిగిన వారు, రాజు గారు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వారు, ఇంకా చెప్పాలీ అంటే వైసీపీ టైం లో ఇంకో ఆర్ కూడా ఆయనకు ఉంది. అదే రెబెల్ అని. ఇలా ఆర్ అన్న అక్షరంతో ఎంతో అనుబంధం పెనవేసుకుని రాజకీయంగా రాణిస్తున్న రఘురామక్రిష్ణంరాజుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ ఫ్యాన్ ప్రత్యేకం. ఆయన పొగిడితే షాక్ తినాల్సిందే. కానీ ఆయన మనసు విప్పి నిజంగా పొగుడుతున్నాను అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్. ఆయనకు రఘురామ క్రిష్ణంరాజుకు మధ్య ఒక వార్ అనేది సాగుతున సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ ఆయన మీద ఫిర్యాదులు చేయడంతో ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. అది కాదు ఏకంగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సిందే అని లేటెస్ట్ గా కొత్త డిమాండ్ ని కూడా పెట్టారు.
ఒక మంచిమాట :
మరి అలాంటి ట్రిపుల్ ఆర్ మీద పీవీ సునీల్ కుమార్ కి ఎంతో అభిమానం ఉందని అంటున్నారు. అందుకే ఆయన గురించి ఒక మంచి మాట చెబుతూ ఆయన యాక్టింగ్ సూపరేహే అంటున్నారు. ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ క్రిష్ణం రాజు మీద యాంకర్ అడిగిన ప్రశ్న కాబోలు. దానికి పీవీ సునీల్ కుమార్ ఇచ్చిన జవాబే చూసే వారికే షాకింగ్ గా ఉంటే రఘురామకు ఎలా ఉంటుందో మరి. ఒక వీడియో చూపించి యాంకర్ రఘురామ కుంటుకుంటూ నడుస్తున్నారు అని అంటారు. దానికి పీవీ సునీల్ కుమార్ నేను కూడా ఇపుడు కుంటుతాను అని వెంటనే అంటారు. అంతే కాదు ఆయన మంచి నటుడండీ బాబూ అని కూడా గభాలున అంటారు. అదేంటీ అంటే ఆయన ఈ మధ్యనే అసెంబ్లీలో నటించారు కదా అని గుర్తు చేస్తారు.
ట్రిపుల్ ఆర్ వర్సెస్ పీవీ :
అవును ఆయన అసెంబ్లీ సమావేశాల ముగింపు వేళ కల్చరల్ యాక్టివిటీస్ లో దుర్యోధనుడి వేషం కట్టారు అది ఏకపాత్రాభినయం. అది చూపించి ఆయన మంచి నటుడే కదా అని యాంకర్ నే అడుగుతారు. మనిషి మరీ అంతగా యాక్ట్ చేస్తారా అంటే నేను చెప్పేది ఈ యాక్టింగ్ గురించి అంటూ పీవీ సునీల్ కుమార్ ఖంగు తినే ఆన్సరే చెబుతారు. మొత్తానికి అయితే పీవీ పొగిడారా తెగిడారా అన్నది చూసే వారికే కాదు అందరికీ అర్ధం అయిపోతోంది. ఇంతకీ మ్యాటరేంటి అంటే వైసీపీ జమానాలో పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉంటూ రఘురామను విచారణ చేశారు. అయితే అది విచారణ కాదు టార్చర్ అని ఆ తరువాత రఘురామ రచ్చ చేయడం తనను కస్టడీలోకి తీసుకుని హత్యా యత్నం చేశారు అని ఫిర్యాదు చేయడం ఇలా బోలెడు జరిగిపోయాయి. ఇపుడు కూటమి ప్రభుత్వంలో రఘురామ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సిట్ ముందు పీవీ సునీల్ హాజరవుతున్నారు. అయితే నాడు రఘురామ కుంటుతున్నది యాక్టింగ్ అని సునీల్ కుమార్ అంటూ మెచ్చుకున్నారా లేక దుర్యోధనుడు యాక్టింగ్ సూపరెహే అంటున్నారా ఏమో తెలియదు కానీ ట్రిపుల్ ఆర్ వర్సెస్ పీవీ ఎపిసోడ్ ఏపీలో కూటమి సర్కార్ లో మరో లెవెల్ అని అంటున్నారు.
